కరీంనగర్- ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ నెలకొనగా, సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకొని, తన శ్రేణులను బరిలోకి దింపి విస్తృత ప్రచారం చేయించింది. పీఆర్టీయూ నుంచి బరిలో ఉన్న వంగ మహేందర్‌రెడ్డి, అలాగే మిగతా అభ్యర్థులు కూడా ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో సర్వప్రయత్నాలు చేస్తుండడం కనిపిస్తున్నది. మొత్తంగా ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తుండగా, వచ్చే వారంలో గెలుపెవరిదో తేలనున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఈ సారి ఉత్కంఠ రేపుతున్నది. బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులుండగా.. అందులో ఇద్దరు ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని ఆయా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు 23,214 మంది ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 27,088కి చేరిం ది. అంటే ఈ సారి 3,874 మంది ఉపాధ్యాయులు కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. అందులో 16,932 మంది పురుషులు, 10,156మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కరీంనగర్లో 4,305 మంది, నిజామాబాద్‌లో 3,751 మంది, సిద్దిపేటలో 3,212 మంది ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 166 ఓట్లు, ఆసిఫాబాద్‌లో 470 ఓట్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 950 ఓట్లున్నాయి.
ఎవరి ధీమా వారిదే?
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ సారి గతానికి భిన్నంగా ప్రచారం చేశారు. సామాజికవర్గాల వారీగా సాగించారు. బీసీ నినాదం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతున్నది. రాష్ట్రంలోని బీసీ కులగణనపై చర్చ జరు గుతున్న నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వ హిస్తూ గెలుపునకు ప్రయత్నాలు చేశారు. 15జిల్లాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుండగా, బరిలో 15 మంది బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్‌సీసీ సంఘాల మద్దతుతో అశోక్ కుమార్, ఎస్టీయూ, మోడల్ స్కూల్, కేజీబీవీ, సీపీఎస్ సంఘాల మద్దతుతో ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి బరిలో ఉండి.. తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
మరికొంత మంది సైతం తమ ప్రచారాన్ని చాపకింద నీరులా సాగిస్తున్నారు. పార్టీ నుంచి బరిలోకి దింపిన బీజేపీ ఈసారి ఎన్నికను తన ప్రతిష్టకు సవాలుగా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొమురయ్యను రంగంలోకి దింపిన ఆ పార్టీ గెలుపు కోసం తన అస్త్రశస్ర్తాలను వినియోగిస్తున్నది. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటుచేసి, ప్రైవేట్ పాఠశాలల్లో పకడ్బందీగా ప్రచారం చేస్తూ.. సదరు ఓటర్లను ఆకట్టుకోవడమే కాకుండా మెజార్టీ ప్రభుత్వ టీచర్లను తమవైపు తిప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ.. ప్రస్తుతం బీజేపీ మొత్తం యంత్రాంగాన్నిసైతం రంగంలోకి దింపింది.
ఈ నేపథ్యంలో గెలుపుపై ప్రధాన ధీమాను వ్యక్తం చేస్తున్నది. ఉపాధ్యాయ సంఘాల్లో అతి పెద్ద యూనియన్ అయిన పీఆర్టీయూ.. మహేందర్‌రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నది. అయితే కూర రఘోత్తంరెడ్డి చూపించే ప్రభావం ఈ యూనియన్‌పై పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో మిగతా అభ్యర్థులు.. గెలుపు కోసం చివరి వరకు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై రకరకాల చర్చలు సాగుతుండగా, గెలుపుపై ఎవరిధీమా వారే వ్యక్తం చేస్తున్నారు.