జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 13: పచ్చదనం, పరిశుభ్రత అభివృద్ధిలో మన పల్లెలు దేశానికి ఆదర్శ గ్రామాలుగా కీర్తిగడిస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023’ జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల హాజరయ్యారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామాలుగా నిలిచిన 15 గ్రామ పంచాయతీలకు అవార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా గ్రామాల స్థితిగతులు మారుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషి, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వం పల్లె ప్రగతి కింద ప్రతి గ్రామానికి నెలనెలా నిధులు కేటాయించడంతో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. వంద శాతం ఇంటి పన్ను వసూళ్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపట్టవచ్చన్నారు. ఇటీవలే కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సంతృప్తి వ్యక్తం చేసినట్లు గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మన పల్లెలు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలువడం అభినందనీయమన్నారు. సమస్యలను సునాయసంగా పరిష్కరించేందుకు తోడ్పాటు అందిస్తామని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించినందుకే అవార్డులు వస్తున్నాయన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పోటీతత్వంతో పనిచేసి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాలన్నారు. ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి, స్వచ్ఛతలో దేశంలోనే మన జిల్లా రెండో స్థానంలో నిలువడం శుభపరిణామమన్నారు. ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి సాధించామన్నారు. అవార్డు పొందిన గ్రామ సర్పంచులు వారి గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. చంద్రశేఖర్‌గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, రైతు సమన్యయ సమితి అధ్యక్షుడు వెంకట్రావ్, డీఆర్డీఓ నరేష్, డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
కేటగిరీ-1లో(2వేల లోపు జనాభా కేటగిరీలో) చిన్నాపూర్(బుగ్గారం), నడికుడ(మల్లాపూర్), చింతలపేట(మెట్‌పెల్లి, గొల్లపెల్లి(వెల్గటూర్), కేటగిరీ-2(2 వేల నుంచి 5 వేల జనాభా) భూపతిపూర్(రాయికల్), మగ్గిడి(ధర్మపురి), రాఘవపట్నం(గొల్లపెల్లి), మద్దులపెల్లి(పెగడపెల్లి), తాటిపెల్లి(మల్యాల), కేటగిరీ-3(ఐదు వేల జనాభా కంటే ఎక్కువ) నాచుపెల్లి(కొడిమ్యాల), ఇబ్రహీంపట్నం, చల్గల్(జగిత్యాల రూరల్), అల్లీపూర్(రాయికల్), వెల్లుల్ల(మెట్‌పెల్లి) గ్రామాలు జిల్లా స్థాయిలో అవార్డులు సాధించాయి.