“వేములవాడ అభివృద్ధి మా బాధ్యత. ఇప్పటికే రూ.వందల కోట్లతో పనులు పూర్తి చేశాం. వచ్చే శివరాత్రి నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తాం” అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం వేములవాడ పట్టణంలో రూ.72 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేసి, రుద్రంగిలో 3.50 కోట్లతో నిర్మించిన కేజీబీవీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వేములవాడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడారు. కాశీలో వేల కోట్లతో అభివృద్ధి చేస్తుంటే దక్షిణకాశీ వేములవాడను ఎందుకు పట్టించుకోవడం లేదని, నిజమైన భక్తుడివైతే ప్రధాని మోడీతో 500 కోట్లు ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.
– వేములవాడ/ రుద్రంగి, డిసెంబర్ 20
వేములవాడ, డిసెంబర్ 20: వేములవాడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేశామని, సినారె కళామందిర్ పునర్నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేస్తామన్నారు. అవసరమైతే మరో రూ.10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. శివరాత్రి నాటికి వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
సిరిసిల్ల స్థాయిలో వేములవాడను అభివృద్ధి చేస్తానని, తనకు రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. వంద పడకల దవాఖానను ఏర్పాటు చేయడమే కాకుండా మోకాలు కీలు మార్పిడి వంటి వైద్య సేవలను ఇక్కడే అందిస్తున్నామని, మరో 9 మంది వైద్యులను నియమించి డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం వేములవాడ పట్టణంతో పాటు రుద్రంగిలో పర్యటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయాచోట్ల మాట్లాడారు. నిర్దేశిత గడువులోగా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వేములవాడ పట్టణానికి వచ్చే అనుసంధాన రోడ్లు, ఇతర ప్రధాన రోడ్లు కూడా హరిత శోభను సంతరించేలా చూడాలని ఆదేశించారు. పట్టణంలో మిగిలిన అభివృద్ధి పనులు, ఇతరత్రా చేపట్టాల్సిన పనులకు తక్షణమే ప్రతిపాదనలు చేయాలని సూచించారు. మహాశివరాత్రి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. మూలవాగులో బండ్ సుందరీకరణ, వంతెనకు విద్యుద్దీపాల అలంకరణ, జంక్షన్ల సుందరీకరణ, పాత నివాసాలు, రాజన్న ఆలయ పరిసరాలు ఇతర ప్రాంతాల్లో వేస్తున్న గోడలపై పెయింటింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట నక్కవాగుపై 12 కోట్లు, మామిడిపల్లిలో 18 కోట్లతో వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇచ్చారని, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పనులు కూడా ప్రారంభించేలా చూస్తామన్నారు.
నిజమైన భక్తుడివే అయితే 500 కోట్లు తీసుకురా..
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నీవు నిజమైన భక్తుడివే అయితే రాజన్న ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి 500 కోట్లు తీసుకురా. కాశీలో వేల కోట్లతో అభివృద్ధి చేస్తుంటే దక్షిణకాశీ వేములవాడను ఎందుకు పట్టించుకోవడం లేదు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, జోగులాంబ, భద్రాచలం ఆలయాలకు కూడా నిధులు తెచ్చి నిజమైన భక్తుడివని నిరూపించుకో. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు ఆలయాలను బదనాం చేశారు. వేములవాడ ఆలయానికి వెళ్తే పదవులు ఊడతాయన్న ప్రచారం చేశారు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో రాజన్నను దర్శించుకోవడమే కాకుండా ఆలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాజన్న ఆలయం విస్తరణ కోసం 30 కోట్లతో 34 ఎకరాలు, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ కోసం 18 కోట్లతో స్థలం సేకరించాం. మా అమ్మానాన్నల పెళ్లి ఇక్కడే జరిగింది. రాజన్న గుడి అభివృద్ధి బాధ్యత మాదే. బీజేపీ మాత్రం అసత్య ప్రచారం చేస్తూ తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నది.
– బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ సవాల్

రైతులకు 65 వేల కోట్లు ఇచ్చిన మొదటి ప్రభుత్వం
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చరిత్రలో 64 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద 65 వేల కోట్లు ఇచ్చిన మొదటి ప్రభుత్వం సీఎం కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే వారం నుంచి మరో విడుత కింద 7600 కోట్లు రైతుల ఖాతాల్లో పడుతాయని చెప్పారు. ప్రమాదవశాత్తూ రైతు మరణిస్తే ఆ కుటుంబానికి పది రోజుల్లో 5 లక్షల బీమా అందిస్తూ రైతు కుటుంబానికి భరోసాగా నిలుస్తున్నది తమ ప్రభుత్వమేనన్నారు. దేశంలోనే ఆడబిడ్డలకు మంచి నీటి కష్టాలను తీర్చిన మొదటి సీఎం కేసీఆర్ అని, దేశంలో మోదీ, గీది ఎవరూ చేయలేదని స్పష్టం చేశారు. పెన్షన్‌ను 200 నుంచి 2 వేలకు పెంచడమే కాకుండా 46 లక్షల మందికి అందజేస్తున్నట్లు వెల్లడించారు. బీడీ కార్మికులు అడగకుండానే వారికి 2 వేల పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. లక్షా 35 వేల ఉద్యోగాలను ఇచ్చామని, మరో 95 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.
ఇంకెక్కడైనా ఉన్నాయా?
మన రాష్ర్టాన్ని ఆనుకొని ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలు పాలిస్తున్నాయని, అక్కడి ప్రజలు మన సంక్షేమ పథకాలను చూసి మీ రాష్ట్రంలో కలుస్తామని చెబుతుండడమే సీఎం కేసీఆర్ ఆదర్శ పాలనకు నిదర్శమని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని 14 గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు, కర్ణాటకలోని రాయిచూర్ ప్రజలు తమను తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఉన్నాయని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పనులు ఉన్నాయో చూపాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో ఉత్తమ పంచాయతీలు 20 ప్రకటిస్తే 19 మన రాష్ర్టానికే వచ్చాయన్నారు. ఉత్తమ మున్సిపాలిటీలు, ఉత్తమ జడ్పీలను ప్రకటిస్తే అందులోనూ మన రాష్ర్టానికే అవార్డులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో బీజేపీ భాగస్వామ్యం ఉందంటూ ఆ పార్టీ నాయకులు తెలివి తక్కువగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో చేసిన ప్రతి అభివృద్ధి పనిలో తమ వాటా ఉందని అబద్ధాలు చెప్పే అలవాటు వారికి ఉందని ఎద్దేవా చేశారు.
మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాతోపాటు రుద్రంగిలో పర్యటించారు. 11.30గంటలకు సంగీత నిలయం (ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు నివాసం)కు చేరుకున్నారు. టీ తాగిన అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడారు. ఆ తర్వాత పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు వీటీడీఏ, టీయూఐఎఫ్డీసీ నిధులు 20 కోట్లతో పట్టణ పరిధిలో చేపట్టే రహదారులు, స్టేడియం నిర్మాణం, సినారె కళామందిరం పునర్నిర్మాణం, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలశాఖ నిధులు 52 కోట్లతో చేపట్టే రహదారుల పునరుద్ధరణ పనులకు సినారె కళామందిరం ఆవరణలో ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఇతర ప్రజాప్రనిధులతో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. 12.30గంటలకు రుద్రంగిలో 3.50 కోట్లతో పూర్తయిన కస్తూర్బాగాంధీ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. 2గంటలకు వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. 3గంటలకు ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేసి సిరిస్లిల వెళ్లారు. క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రం తీరును ఎండగట్టారు.
సెస్ ఎన్నికల్లో చరిత్రను తిరగరాద్దాం
సెస్ ఎన్నికల్లో నిఖార్సయిన అభ్యర్థులను ఎంపిక చేసి పోటీ చేయిస్తున్నందున ఎన్నిక చరిత్రలో నిలిచేలా ఉండాలి. రూ.వంద కోట్లతో ఆ రోజుల్లో ఏర్పాటు చేసుకున్న సెస్ విద్యుత్ సంస్థతో సిరిసిల్లలో మరమగ్గాలు కూడా వచ్చి నేతన్నలకు ఉపాధి పెరిగింది. మంచి పాలకవర్గాన్ని ఎన్నుకొని సేవలను అందుకుందాం. మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల-వేములవాడ నీళ్లు లేని పరిస్థితుల నుంచి స్వరాష్ట్రంలో పుష్కలంగా పంటలు పండించే స్థాయికి ఎదిగాయి. అంతేకాకుండా, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 60 వేల 62 మందికి 562 కోట్ల రైతుబంధు వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు మంత్రి కేటీఆర్ కేజీబీవీ భవనాన్ని ప్రారంభించడం సంతోషకరం. రుద్రంగి, మానాల నాకు రెండు కండ్లు. రెండింటి అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. కలికోట సూరమ్మ చెరువుతో పాటు ఎల్లంపెల్లి ప్రాజెక్టు సాగునీటితో ధాన్యం ఆరబోయడానికి స్థలం లేనంతగా పంటలు పండాయి. రుద్రంగిలో 30 పడకల దవాఖాన మంజూరుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారు.
– ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
15 స్థానాలు గెలిపిద్దాం
సెస్ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు బహుమానంగా ఇద్దాం. బీఆర్ఎస్ మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపించడం కోసం కార్యకర్తలు, నాయకులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి అన్నిస్థానాలు గెలిపించాలి.
– బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
అన్ని రంగాల్లో అగ్రగామి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని విద్య, వైద్యం, సాగు, తాగు నీరు, రవాణా వంటి అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నది. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారి, దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి.
– సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ