విరమణ, సర్వీసులో ఉన్న అధికారులను సింగరేణి చిన్నచూపు చూస్తున్నది. న్యాయంగా దక్కాల్సిన పనితీరు ఆధారిత వేతనం (పర్ఫామెన్స్ రిలేటెడ్ పే) ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నది. ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు ప్రభుత్వ జాప్యంతో మొత్తం 337 కోట్లు పెండింగ్లో ఉండడం విమర్శలకు తావిస్తుండగా, రిటైర్డ్ అధికారులు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది.
గోదావరిఖని, డిసెంబర్ 25 : సింగరేణి నుంచి విరమణ చేసిన దాదాపు 350 మందికి పైగా అధికారులు పీఆర్పీ బకాయిల కోసం సుధీర్ఘ న్యాయ పోరాటం చేశారు. 2007-08 నుంచి 2013-14 మధ్య కాలానికి సంబంధించి రావాల్సిన 63కోట్ల కోసం ఎదరుచూశారు. ఎట్టకేలకు గతేడాది ఫిబ్రవరిలో బకాయిలను వెంటనే చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ, ఆ తీర్పు వెలువడి 22 నెలలు గడుస్తున్నా యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలికపోవడంతో రిటైర్డ్ అధికారులు నిరాశ చెందుతున్నారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంపై మండిపడుతున్నారు. కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధమవుతున్నారు.
సింగరేణి సంస్థలో అధికారుల పరిస్థితి దారుణంగా ఉంది. రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి దాదాపు 274 కోట్ల నిధులు విడుదలలో జాప్యం జరుగుతున్నది. 2022-23కు 140కోట్లు, 2023-24కు 134 కోట్లు పరిపాలనాపరమైన అనుమతుల పేరిట ఫైళ్లను పెండింగ్లో పెట్టడం మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నది. రికార్డు స్థాయి లాభాలు సాధిస్తున్నా, కష్టపడి పనిచేసే ఉద్యోగులకు ఫలితం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రిటైర్డు ఉద్యోగులు, ఇటు ప్రస్తుత అధికారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిధులు రాక రిటైర్డు అధికారులకు వృద్ధాప్యంలో అత్యవసర వైద్య చికిత్సల కోసం ఇబ్బంది పడుతుండగా, కుటుంబ అవసరాలు, పిల్లల ఉన్నత చదువులు, గృహ రుణాల చెల్లింపుల కోసం అధికారులు ఆగమవుతున్నారు.
ఒకవైపు సంస్థ లాభాల్లో ఉందని ప్రకటిస్తూనే మరోవైపు ఉద్యోగుల హక్కులను కాలరాయడం సంస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నదని సింగరేణి రిటైర్డ్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. హైకోర్టు ఆదేశించినా 63కోట్లు చెల్లించకపోవడం అత్యంత బాధాకరమని వాపోతున్నారు. జీవిత చరమాంకంలో ఇలా గోస పెట్టడం సరికాదని సూచిస్తున్నారు. తమపై ప్రభుత్వం చూపుతున్న నిర్ల్య వైఖరి ఇది నిదర్శనమని మండిపడుతున్నారు. సింగరేణిలో నెలకొన్న ఈ ఆర్థిక ప్రతిష్టంభనను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యంతో చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అటు కోర్టు తీర్పును గౌరవిస్తూ రిటైర్డు ఉద్యోగులకు ఇటు ప్రస్తుతం శ్రమిస్తున్న అధికారులకు పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వేడుకుంటున్నారు.