Indiramma houses | జగిత్యాల, జూలై 27, (నమస్తే తెలంగాణ)/జగిత్యాల : జగిత్యాల అర్బన్ పరిధిలోని నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇండ్ల నిర్మాణం చేపట్టి, వివిధ స్థాయిల్లో నిలిచిపోయి ఉన్న దాదాపు వంద ఇండ్లను జగిత్యాల మున్సిపల్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్చివేయడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. నూకపెల్లి కాలనీలో గతంలోనే నిర్మాణం చేపట్టి వివిధ స్థాయిలో ఉన్న ఇండ్లను లబ్ధిదారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం సమచారం సైతం ఇవ్వకుండా ఇండ్లను కూల్చివేయడంపై లబ్ధిదారులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల కూల్చివేత విషయం రాజకీయ వివాదంగా మారిపోయింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కూల్చివేసిన ఇండ్లను పరిశీలించి, లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయగా, అభివృద్ధి కోసమే కొన్ని నిర్మాణాలను కూల్చివేశామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రకటన చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో నూకపెల్లి అర్బన్ కాలనీ ఉంది. 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాలనీ ఏర్పడింది. 2008లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా జీవన్‌రెడ్డి పనిచేస్తున్న సమయంలో నూకపెల్లి సమీపంలో ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ భూమికి మరో 150 ఎకరాల స్థలాన్ని సేకరించి కాలనీ ఏర్పాటుకు ప్రయత్నించారు. జగిత్యాల పట్టణానికి చెందిన 4వేల మందికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పట్టాలు జారీ చేయడంతో పాటు, వారికి కొన్ని సౌకర్యాలు కాలనీలో కల్పించారు.
అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీతో పాటు రుణ సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడు వందల మంది ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొన్నారు. కొందరు నివాసం ఉంటూ వచ్చారు. అయితే చాలా మంది ఇంటి నిర్మాణం చేపట్టినా డబ్బులు పూర్తిస్థాయిలో లేక ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం నూకపెల్లిలోని ఇందిరమ్మ కాలనీలో అందుబాటులో ఉన్న స్థలంలో 4,520 ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే స్థలం అందుబాటులో లేకపోవడంతో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కొన్నింటిని కూల్చివేసి నిర్మాణం చేపట్టారు.
ఐదారేండ్ల వ్యవధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. అయితే నిర్మాణ సమయంలో దాదాపు 1500ల మంది లబ్ధిదారులకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూల్చివేసిన అధికారులు, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో న్యాయం చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాజకీయ లబ్ధికోసమే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇలా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
వంద నిర్మాణాల కూల్చివేత..
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కూల్చివేసిన నిర్మాణాలు పోను మరికొన్ని నిర్మాణాలు కాలనీలో ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో నిర్మించేందుకు సహకరించాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రమిచ్చారు. దీంతో సీఎం కలెక్టర్‌ను నిర్మాణాల పూర్తిపై నివేదిక ఇవ్వాలని కోరగా, నిర్మాణలకు రూ.52 కోట్లు వ్యయం అవుతుందని కలెక్టర్ సీఎం నివేదించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున మున్సిపల్ అధికారులు జేసీబీలతో దాదాపు వంద నిర్మాణాలను కూల్చివేయడం వివాదస్పదంగా మారింది. నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఎలాంటి, నోటీసులు ఇవ్వకుండానే, కనీసం సమాచారం ఇవ్వకుండా చేయడంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నూకపెల్లిలో కూల్చివేసిన ఇండ్లను పరిశీలించి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం దృష్టికి తీసుకెళ్లగా జిల్లా అధికారులు రూ.52 కోట్లు అవసరం అవుతాయని నివేదిక ప్రభుత్వానికి అందజేశారన్నారు. నిధుల విడుదల సమయంలోనే ఇలా చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని విమర్శించారు. నూకపెల్లిలో ఎఫ్ బ్లాక్ సమీపంలో ఒకేవద్ద 10 ఎకరాలు స్థలం ఉందన్నారు. కాలనీలో ఏవిధమైన కూల్చివేతలు లేకుండా 20 ఎకరాల స్థలం లభిస్తుందని అవకాశం ఉన్నప్పటికి నిర్మాణాలను కూల్చివేయడం సరికాదన్నారు. ఇంత పెద్ద కాలనీ నిర్మాణానికి లేఅవుట్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మున్సిపల్ అధికారుల పనితీరు సైతం సరిగా లేదని, ఇప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలనే పాటిస్తున్నారంటూ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
నూకపెల్లి కాలనీతో పాటు, జగిత్యాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్. ఆయన ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీ దాదాపు పట్టణంగా మారే పరిస్థితి ఏర్పడిందని ఈ నేపథ్యంలో అక్కడ పాఠశాలలు, డార్మెంటరీ హాల్స్, ఆసుపత్రి, అంగన్వాడీ ఇతర సామూహిక నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వాటి నిర్మాణానికి స్థలం అందుబాటులో లేకపోవడంతో నిర్మాణాలను కూల్చివేశామే తప్ప, మరో ఉద్దేశం లేదన్నారు. అభివృద్ధిని రాజకీయ కక్షతో అడ్డుకోవద్దని, అభివృద్ధికి సహకరించాలన్నారు. నిర్మాణంలో ఉండి, కూల్చివేతకు గురై నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామన్నారు.
కూల్చివేతలపై స్పందించని మున్సిపల్ కమిషనర్…
నూకపెల్లి అర్బన్ కాలనీలో వంద నిర్మాణాల కూల్చివేత విషయంలో జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోసం సంపద్రించగా ఆమె స్పందించలేదు. పలుమార్లు ఫోన్ చేసి వివరణ తీసుకునేందుకు యత్నించగా, ఆమె ఫోన్ కాల్‌కు అందుబాటులోకి రాలేదు. రాత్రిపొద్దుపోయిన తదుపరి సానిటరీ ఇన్స్పెక్టర్, 42వ వార్డు ఆఫీసర్లు నమస్తే తెలంగాణ విలేకరికి ఫోన్ చేసి తమ కమిషనర్‌కు ఫోన్ చేశారు..మా మేడమ్ అందుబాటులో లేరు…సమస్య ఏంటీ అని ప్రశ్నించగా, ఇందిరమ్మ నిర్మాణల కూల్చివేతపై వివరణ కావాలని వివరించగా, కమిషనర్‌కు సమాచారం ఇస్తామని ఫోన్ పెట్టేశారు. రాత్రి వరకు కూల్చివేతలపై ఎలాంటి వివరణ, స్పందన మున్సిపల్ కమిషనర్ నుండి రాకపోవడం గమనార్హం.
రాజకీయ చదరంగంలో పేదలు బలి…
రాజకీయ చదరంగంలో పేదలమైన తాము బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూకపెల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన లబ్ధిదారులు. నిరుపేదలం కావడం వల్లనే దాదాపు పదిహేడేండ్లుగా ఇండ్ల నిర్మాణం చేసుకోలేకపోయామంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో పాటు, బ్యాంకులో రుణాలు తీసుకున్న నిర్మాణం చేపట్టలేకపోయామని, ఇప్పుడు తమను పూర్తిగా అన్యాయం చేస్తున్నారని వారు వాపోతున్నారు. గతంలోనూ దాదాపు పదిహేను వందల మందికి సంబంధించి వివిధ స్థాయిల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని, కూల్చివేత సమయంలో నిర్మాణం చేసే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామన్నారని, తీరా నిర్మాణం పూర్తి అయిన తదుపరి మొండిచేయి చూపారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు మరో వంద మందికి సంబంధించిన నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని వారు బోరుమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరిగితే ఒకరికి పేరు వస్తుందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వల్ల మరొకరి పేరు వస్తుందన్న ఆలోచనలతో రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగంలో తాము బలి అవుతున్నామంటున్నారు. ఒకరికొకరు ఒక్కో రకంగా మాట్లాడితే మరోకరు మరో రకంగా మాట్లాడుతున్నారని, అసలు తమకు ఏం అర్థం కావడం లేదని, కాని తాము కష్టపడి నిర్మించుకున్న ఇండ్లను మాత్రం తమకు లేకుండా చేశారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ పేరు కోసం కాకుండా, పేద ప్రజల మేలు కోసం పనిచేయాలని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.