పెద్దపల్లి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో అక్రమ నిర్మాణాల పనిపట్టేందుకు కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, నీటిపారుదల, ల్యాండ్ సర్వేయర్, తదితర శాఖలతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో 9.19ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తాళ్లకుంట, 65 ఎకరాల్లో ఉన్న బంధంపల్లి చెరువు, 5.2 ఎకరాల్లో ఉన్న రంగంపల్లి చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీ ఎల్లోని అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. ఆయా చెరువుల పరిధిలో డీజీపీఎస్ (డిజిటల్ గ్లోబల్ పొజిషన్ సర్వే)తో ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించారు. మార్కింగ్ చేసి ఎర్ర జెండాలను కూడా పాతుతున్నారు.
అక్రమ నిర్మాణాలుంటే, వివరాలను బల్దియా కమిషనర్లకు తెలియజేస్తూ, తొలగింపునకు సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు తాళ్లకుంట చెరువు బఫర్ జోన్లో డంప్‌యార్డ్ ఉన్నట్టు నిర్ధారించారు. రంగంపల్లి చెరువు బఫర్ జోన్లో ప్రభుత్వ హాస్టల్, ఒక చర్చి, నిర్మాణంలో ఉన్న ఒక భవనం ఉన్నాయని, బంధంపల్లి చెరువు బఫర్ జోన్లో 2 రేకుల షెడ్లు, లే అవుట్‌తో ఏర్పాటు చేసిన వెంచర్ ప్రహరీ, శ్మశానవాటిక ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక రామగుండం నగరంలోని మల్కాపూర్ పరిధిలో మల్లపురాణి కుంటలో కుంటను సర్వే చేశారు. హద్దులను నిర్ధారించారు.
26ఎకరాల ఒక గుంట విస్తీర్ణంలో చెరువు విస్తరించి ఉండగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో దాదాపు 40కి పైగా నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించి, పలువురికి నోటీసులు జారీ చేశారు. ఇక పెద్దపల్లి బంధంపల్లి చెరువు బఫర్ జోన్లో ఇటీవలే ఓ రియల్టర్ నిర్మించిన ప్రహరీని నేల మట్టం చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జంట చెరువులైన ఎల్లమ్మ, గుండమ్మ చెరువు శిఖం భూముల్లో అక్రమంగా నిర్మించిన ప్రహరీలను, అక్రమంగా వెలిసిన వెంచర్ల సరిహద్దు రాళ్లను టాస్క్‌ఫోర్స్ అధికారులు తొలగించారు. ఇదిలా ఉండగా, జిల్లాలో 15 అక్రమ కట్టడాలపై కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎస్సారెస్పీ తదితర శాఖలకు ఫిర్యాదులు రాగా, అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారని తెలిసింది.
జిల్లాలో ఎక్కడ చెరువులు, కుంటలు, కాల్వలు కబ్జాకు గురైనా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు జరిగినట్లు గుర్తించినా మా దృష్టికి తేవాలి. సర్వేలు చేసి వాటిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలు కబ్జాలపైనా ఉక్కుపాదం మోపుతాం. ఫిర్యాదులు చేయాల్సిన వారు ‘drdopeddapalli@gmail.com కు మెయిల్ చేయాలి. లేదా నేరుగా రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు.
– శ్రీనివాస్, ఏడీ, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి (పెద్దపల్లి)