ఈ కింది చిత్రంలో దుమ్ముతో కనిపిస్తున్న రోడ్డు పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయాన్ని ఆనుకొని రాజీవ్ రహదారి. రంగంపల్లి వద్ద ఇలా బూడిదతో నిండిపోయింది. ఈ రూట్లో అధికలోడ్‌తో టార్పాలిన్లు కూడా సరిగా కప్పకుండా ‘రయ్..రయ్’ మంటూ ఇసుక, బూడిద లారీలు, టిప్పర్లు దూసుకుపోతుండడంతో నిత్యం దమ్ము, యాష్ లేస్తుండగా, వాటి వెనుక వచ్చే వాహనాదారులు రోడ్డు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాదారులు కండ్లల్లో బూడిద పడి ప్రమాదాలకు లోనై కాళ్లుచేతులు విరగ్గొట్టుకుంటున్నారు. కానీ, అధిక లోడ్ వాహనాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, జాతీయ భద్రత మాసోత్సవాల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న లారీ పెద్దపల్లి-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నది. అందులో బూడిదను తరలిస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా ట్రాలీని రెండు మూడు ఫీట్ల వరకు ఎత్తు పెంచేశారు. ఇలాంటి ఓవర్‌లోడ్ వాహనాలు నిరంతరం నడవడం వల్లే రోడ్లు చిధ్రమవుతున్నాయి. గాడాలు పడుతున్నాయి. కట్టడి చేయాల్సిన రవాణాశాఖ అధికారులు చోద్యం చూస్తుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.
పెద్దపల్లి, జనవరి 8(నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ‘రోడ్డు భద్రత.. అందరి బాధ్యత’ అంటూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్న అధికారయంత్రాంగం, అందుకు తగ్గ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారులైన గోదావరిఖని-కరీంనగర్, మంథని కరీంనగర్ రోడ్లపై ఇటీవలి కాలంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. జిల్లాలో సహజ వనరులైన బూడిద, ఇసుక, మట్టి, బొగ్గు, ఇటుక ఓవర్‌లోడ్‌తో లారీలు తరలివెళ్తుండడంతో కరీంనగర్ వైపు ప్రధాన రహదారిపై గాడాలు పడ్డాయి.
దీంతో ఈ రోడ్డుపై వాహనాలు అదుపు తప్పి బోల్తా పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే గోదావరిఖని-కరీంనగర్, మంథని-కరీంనగర్‌కు నిత్యం వందలాది బూడిద, ఇసుక లారీలు అధిక లోడ్‌తో వెళ్తుండగా, ఆ దారుల్లో భారీగా దుమ్ము లేస్తున్నది. వాటి వెనుక వచ్చే వాహనదారులకు ముందు రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే 28 ప్రాంతాలను పోలీసులు బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించారు. కానీ ఆయాచోట్ల సూచిక లేదా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది.