పెద్దపల్లి, మార్చి 3 (నమస్తే తెలంగాణ): బూడిద లోడింగ్‌ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒక్కో టిప్పర్‌కు 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి తమకు విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అంతర్గాం మండలం మల్యాలపల్లి గేట్ వద్ద యాష్ టిప్పర్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బూడిద లారీల రవాణాను నిలిపివేసి ఎన్టీపీసీకి వ్యతిరేకంగా నినదించారు.
ఎన్టీపీసీ విస్తరణతో సర్వస్వం కోల్పోయిన తమపై యాజమాన్యం వివక్ష చూపుతున్నదని, లారీలపై పనిచేస్తున్న తమ కడుపుకొట్టేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రతి రోజూ దాదాపుగా వెయ్యి లారీల ద్వారా బూడిద రవాణా జరుగుతుంటే అందులో స్థానిక లారీలు కేవలం 120వరకే ఉంటాయని చెప్పారు. నేషనల్ హైవేల నిర్మాణానికి బూడిదను తరలిస్తున్న లారీలకు ఎన్టీపీసీ ఒక్కో టన్నుకు 1260 చెల్లిస్తున్నదని, స్థానికంగా చిన్న చిన్న ఇటుక బట్టీలకు రవాణా చేసుకొనే తమకు మాత్రం అలాంటి చెల్లింపులేమీ చేపట్టడం లేదని మండిపడ్డారు.
పైగా ఒక్కో లారీకి 4600 నుంచి 9200 వరకు లోడింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని వాపోయారు. యాష్ పాండ్‌లో లోడింగ్ దళారుల నుంచి విముక్తి కల్పించి ఇకపై నేరుగా ఎన్టీపీసీనే లోడింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి ఎక్కడికైనా బూడిద రవాణాను సైతం తామే చేస్తామన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో తమ లారీల నుంచి బూడిద రవాణా చేపట్టబోమని అల్టిమేటం ఇచ్చారు. తమ సమస్యను ఎన్టీపీసీ యాజమాన్యం పరిష్కరించే వరకూ రవాణాను నిలిపి వేస్తున్నామని ప్రకటించారు. తమకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపి మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.
బూడిద ఫ్రీ లోడింగ్ చేపట్టాలి
ఎన్టీపీసీ యాజమాన్యం యాష్ పాండ్లలో లోడింగ్‌ను ఫ్రీగా చేపట్టాలి. ఈ దళారుల వసూళ్లను నిలిపివేయాలి. మల్యాలపల్లి బూడిద చెరువులో రోజుకు అక్రమంగా రూ. 50లక్షల వరకు వసూళ్లు చేస్తున్నరు. ఈ అక్రమ వసూళ్లలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్‌తోపాటు పై వరకూ పెద్ద ఎత్తున డబ్బులు ముడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నయి. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు అందుకే స్పందించడం లేదు. దగ్గరుండి స్థానికులకు అన్యాయం చేస్తున్నారు. బూడిద రవాణా నిలిపివేస్తున్న లారీ, టిప్పర్ యజమానులకు మేం మద్దతుగా నిలుస్తం. స్థానికులకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదు.
-కౌశిక్‌హరి, కార్మిక సంఘాల నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు (రామగుండం)
మాకు న్యాయం చేయాలి
మేం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినం. ఇక్కడ లారీలను కొనుక్కొని ఉపాధి పొందుతున్నం. స్థానికులమైన మమ్మల్ని కాదని ఎన్టీపీసీ టెండర్లను పెట్టుకొని దళారులను తయారు చేసింది. మాతో ట్రిప్పులు కొట్టుకునే ఇటుక బట్టీలకు కూడా వాళ్లే కొట్టుకుంటున్నరు. 500, 600కే లోడింగ్ అయ్యేది. ఇప్పుడు 4,600 వసూలు చేస్తున్నారు. బయటి నుంచి లారీలను పిలిపించి స్థానిక లారీలను తిరగకుండా మా పొట్టకొడుతున్నరు. రోజుకు ఒక్క ట్రిప్పు కూడా పడడం లేదు. మా లారీలకు ఈఎంఐలు ఎలా కట్టుకోవాలే. మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలే. ఇవన్నీ ఆలోచించడం లేదు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి మాకు న్యాయం చేయాలి.
-బడికెల రాజశేఖర్, యాష్ టిప్పర్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు (రామగుండం)
న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తం
పొల్యూషన్, పొగ అనుభవించేది మేం. కానీ, మేం ఇక్కడ పూర్తిగా నష్టపోతున్నం. బయటి నుంచి వచ్చే లారీల వాళ్లకే లాభం అవుతున్నది. ఎన్టీపీసీ ప్రోత్సహిస్తే మేమే ఇంకా లారీలు కొనుక్కొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా బూడిదను మేమే సరఫరా చేస్తం. ఎన్టీపీసీ అలా చేయడం లేదు. బయటి లారీలకు ఒక్కో లారీకి 60వేల వరకు ఇస్తున్నది. మేమేమో ఒక్కో లారీకి 4600 నుంచి 9200 వరకు కట్టుకుంటున్నం. ఎన్టీపీసీనే ఫ్రీ లోడింగ్‌ను చేపట్టాలి.
-శివనాద్రి గంగాధర్, మాజీ అధ్యక్షుడు లారీ అసోసియేషన్ (రామగుండం)