కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 18: గ్రూపు -3 పరీక్షల్లో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ (ఐవో)లుగా పనిచేసిన వారికి ఇచ్చే రెమ్యునరేషన్‌పై ఏర్పడిన వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఈ మేరకు కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్ టీజీపీఎస్సీ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ నెల 17,18 తేదీల్లో గ్రూపు-3 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. వీటి పర్యవేక్షణకు సంబంధించి పలువురు అధికారులను నియమించిన విషయం విదితమే. ముఖ్యంగా ప్రతి సెంటర్‌కు ఇన్విజిలెటర్లతో పాటు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ పేరిట కొంతమందిని నియమించారు.
పరీక్ష రాయడానికి వచ్చిన ప్రతి అభ్యర్థినీ గేటు వద్ద పరిశీలించి.. హాల్‌టికెట్‌లోని ఫొటోకు వచ్చిన అభ్యర్థికి పోల్చి చూసి, ఒకే అని నిర్ధారించిన తర్వాతే ఐవోలు లోపలికి పంపిస్తారు. ఇది ఒక రకంగా కత్తిమీద సాము లాంటిదే. ఏమాత్రం పొరపాటు జరిగినా ఐవోలకు ఇబ్బందే. కాగా, రెండు రోజులపాటు విధులు నిర్వర్తించిన ఐవోలకు ఒక్కొక్కరికి 700 చొప్పున రెమ్యునరేషన్ చెల్లించడానికి అధికారులు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియానికి పిలిపించారు. అయితే రెండు రోజులపాటు నిర్విరామంగా పనిచేసిన తమకు కేవలం 700 ఎలా ఇస్తారని సదరు ఐవోలు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. టీపీపీఎస్సీ నుంచి తమకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇచ్చే రెమ్యునరేషన్ 700 పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆడిటోరియం నుంచి బయటకు వచ్చి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు రవీందర్‌సింగ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన కలెక్టరేట్‌కు చేరుకొని ఐవోల ఆందోళనకు అండగా నిలిచారు. ముందుగా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను విన్నవించారు. అదనపు కలెక్టర్ జడ్పీ కార్యాలయంలో ఉన్నారని తెలుసుకొని, రవీందర్‌సింగ్ ఐవోలను తీసుకొని అక్కడికి వెళ్లి రెమ్యురేషన్ పెంచి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. విన్నపాన్ని టీజీపీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు అదనపు కలెక్టర్ చెప్పారని రవీందర్‌సింగ్ తెలిపారు. నిజానికి అన్ని జిల్లాల నుంచి ఈ విన్నపాలను అదనపు కలెక్టర్లకు ఇప్పించి, న్యాయం జరిగేలా చూస్తామని రవీందర్‌సింగ్ తెలిపారు. తక్షణం స్పందించిన ప్రఫుల్ దేశాయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటు సమాచారం ఇవ్వగానే వచ్చి, తమకు అండగా నిలిచిన రవీందర్‌సింగ్‌కు ఐవోలు కృతజ్ఞతలు చెప్పారు.