అమృత్ భారత్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా రెండేండ్ల కిందట రూ.26.49 కోట్లతో పెద్దపల్లిలో చేపట్టిన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు పర్యాయాలు మారిన డిజైన్లతో పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
-పెద్దపల్లి, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ)
అమృత్‌భారత్ రైల్వే స్టేషన్‌గా పెద్దపల్లి స్టేషన్‌ను రెండో విడుతలో ఎంపిక చేయగా.. కొత్త భవనం నిర్మాణం కోసం పాతది కూల్చివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఫ్లాట్ ఫాం పైకప్పు లేకుండా పోయింది. స్టేషన్లో జరుగుతున్న పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఫ్లాట్ ఫాం నంబర్ 1, 2లలో సగం వరకు నిర్మాణ పనులు చేపట్టడంతో రైలు వచ్చే సమయంలో ప్రయాణికులు సరస్ ఫీట్లు వేయాల్సి వస్తున్నది. టికెట్ బుకింగ్ కోసం నిర్మించిన తాతాలిక షెడ్డు నుంచి ఫ్లాట్‌ఫాం మీదకు వెళ్లేందుకు తాతాలిక కవరింగ్ షెడ్లు నిర్మించినప్పటికీ లైట్లు లేకపోవడంతో రాత్రిళ్లు ఇబ్బందులు పడక తప్పడం లేదు. పునరుద్ధరన పనులు వేగవంతంగా జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ను అమృత్‌భారత్ స్టేషన్‌గా ఎంపిక చేయడం ఆనందకరమే. కానీ, ఇక్కడ రద్దీ అధికంగా ఉంటుంది. 50కి పైగా ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస రైళ్లు ఆగుతాయి. స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేశారు. కానీ, సౌకర్యాల విషయంలో మాత్రం అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారు. పనుల పునరుద్ధరణ విషయంలో సైతం అదే జరుగుతున్నది. స్టేషన్ డిజైన్లను తరచూ మారుస్తూ పునరుద్ధరణ పనులను ఆలస్యం చేస్తున్నారు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడక తప్పడం లేదు. రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ చూపి పనులు వేగవంతంగా సాగేలా చర్యలు చేపట్టాలి.
-ఫణి అక్షిత్, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం వ్యవస్థాపకుడు.(పెద్దపల్లి)