Acharya Konda Laxman Bapuji | జూలపల్లి, సెప్టెంబర్ 21 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ తొలితరం ఉద్యమ నేత శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జూలపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అనిల్ మాట్లాడుతూ.. పద్మశాలీ ముద్దుబిడ్డ బాపూజీ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేశాడని గుర్తు చేశారు. మలిదశ ఉద్యమానికి ఊపిరి అందించిన మహనీయుడని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకున్న బాపూజీ అన్ని సామాజిక వర్గాలకు ఆదర్శనీయుడన్నారు. కార్యక్రమంలో ఎస్ఎంసి మాజీ చైర్మన్ ఏదుల్ల కనకయ్య, రజక సంఘం అధ్యక్షుడు నగునూరి నారాయణ, మాజీ వార్డు సభ్యుడు గంగిపల్లి శ్రీనివాస్, పద్మశాలి సంఘం మండల ఉపాధ్యక్షుడు ఉప్పుల తిరుపతి, యువత విభాగం గ్రామాధ్యక్షుడు కొండ రవీందర్ నాయకులు అందె మల్లేశం, వెంగళ వెంకటేశం, దారవేని అరుణ్, గంగిపెల్లి సాగర్, తదితరులు పాల్గొన్నారు.