కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ఇజ్రాయెల్ దేశంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు, ఒక రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ స్టడీ టూర్‌కు వెళ్తున్నారు. శనివారం నుంచి ఈ నెల 10 వరకు ఈ స్టడీ టూర్ కొనసాగనున్నది.
కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, జగిత్యాల వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ జీ శ్రీనివాస్‌తోపాటు సిరిసిల్ల జిల్లా రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య ఈ స్టడీ టూర్‌కు వెళ్తున్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బీ నీరజ ప్రభాకర్ నేతృత్వంలో ఇజ్రాయెల్‌కు అధ్యయనం కోసం వెళ్తున్న ఈ బృందంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు ఉన్నారు.