నమస్తే నెట్వర్క్, ఆగస్టు 28 : దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’కు శ్రీకారం చుట్టగా, ఈ పథకం దిగ్విజయంగా అమలవుతూ దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఇందుకు నిదర్శనమే పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్ నియోజకవర్గం. గతేడాది ఆగస్టు 16న శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా ఈ పథకాన్ని సీఎం ప్రారంభించగా, ఇక్కడి దళితుల కోసం 2 వేల కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 13,944 మంది లబ్ధిదారులను గుర్తించి, 11,480 మందికి యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. దీంతో ఏడాది క్రితం వరకు కూలీలు, డ్రైవర్లుగా ఉన్న వాళ్లు ఇప్పుడు వాహనాలు, దుకాణాలకు ఓనర్లుగా మారారు. విద్యావంతులైన యువకులు కంప్యూటర్ సెంటర్లు, మెడికల్ షాపులు, మీ సేవ కేంద్రాలు, ఫొటో స్టూడియోలు పెట్టుకున్నారు. ఇంకొందరు సెంట్రింగ్, ఎలక్ట్రికల్, సిమెంట్, ఐరన్ అండ్ హార్డ్ వేర్, ఫుట్‌వేర్, ఫర్టిలైజర్, ఆటో మొబైల్, బట్టల షాపులు, బేకరీలు, సూపర్ మార్కెట్లు, డెయిరీలు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు నడిపిస్తున్నారు. కొందరు గ్రూపుగా ఏర్పడి కూడా వ్యాపారాలను పెట్టుకున్నారు. సొంతంగా ఉపాధి పొందడంతోపాటు మరో నలుగురికి పని కల్పిస్తూ గౌరవంగా బతుకుతున్నారు. ఒక్క నియోజకవర్గంలోనే ఇంతటి మార్పు తెచ్చిన గొప్ప పథకంపై ఓ చానల్ ఎండీ ‘దళితులకు ఊరికే రూ.10 లక్షలు ఉచితంగా ఇచ్చేస్తారా?’ అంటూ అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడంపై దళితలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇన్నాళ్లూ తాము పడ్డ కష్టాలు, అవస్థలు కనబడలేదా? అంటూ ప్రశ్నిస్తున్నది. కూలీలు, డ్రైవర్లుగా బతికిన తాము యజమానులై ఆర్థికంగా ఎదుగుతుంటే కండ్లమంట ఎందుకంటూ నిలదీస్తున్నది. ఏ ఆధారం లేని తమకు ‘దళితబంధు’ దారి చూపితే ఇంత అక్కసు ఎందుకని, నిరుపేదల సంక్షేమానికి నిధులు కేటాయిస్తే ఉచితమెలా అవుతుందని ప్రశ్నిస్తున్నది. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలు అమలు కాకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దళిత లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమండ్ చేస్తున్నది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నది.
కూలీ నుంచి ఓనర్‌గా..
.. ఈమె పేరు జూపాక ఉష. భర్త రాజు కూలీ, ఆమె టైలరింగ్ పీస్ వర్ చేసేది. కిరాయి ఇంట్లో ఉంటూ కొడుకు, కూతురును ఉన్నంతలో చదివిస్తున్నరు. టైలరింగ్‌లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్‌ను కొనుకోవాలని ఉషకు ఆశ ఉన్నా, ఆర్థిక పరిస్థితులతో నెరవేరలేదు. చేసేదేమీ లేక బట్టలు కుడుతూ రోజుకు రూ.200 సంపాదించేది. ఒక్కో రోజు ఈ పనికూడా ఉండకపోయేది. ఈ సమయంలో వచ్చిన దళితబంధు పథకం ఆమె కుటుంబానికి వరంలా మారింది. మొదటి విడుతగా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషిన్ కొనుక్కొని ఆశ నెరవేర్చుకున్నది. కొత్తపల్లిలో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్ సారీ సెంటర్ ప్రారంభించి నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నది. బ్లౌజ్‌లపై కొత్త కొత్త డిజైన్ల వేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నది. రోజువారీ కూలీ నుంచి ఓనర్ అయ్యానని, దళితబంధు తమ కుటుంబానికి ఎంతో ఆసరా అయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నది. ఇలా ఉషనే కాదు, ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో యూనిట్లు పొందిన దాదాపు 14 వేల మంది లబ్ధిదారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. – జమ్మికుంట రూరల్, ఆగస్టు 28
నాడు చికెన్ సెంటర్.. నేడు కారు ఓనర్
.. ఇతని పేరు పిప్పాల గంగాధర్. ధర్మపురి మండలంలోని మగ్గిడి గ్రామానికి చెందిన ఇతను గతంలో గ్రామంలోనే చిన్న చికెన్ సెంటర్ పెట్టుకుని ఉపాధి పొందేవాడు. రోజుకు రూ.300 వరకు మిగిలేవి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు గంగాధర్ జీవితాన్ని మార్చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారుడుగా ఎంపికైన అతను యూనిట్ కింద కారు ఎంపిక చేసుకున్నాడు. రోజూ చికెన్ కొట్టే తాను కారుకు ఓనర్ అవుతానని కలలోకూడా ఊహించలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ధర్మపురి ప్రాంతంలో ఎక్కువగా కిరాయిలు దొరకకపోవడం వల్ల మంత్రి ఈశ్వర్ గుగూల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కొన్ని దళితబంధు కార్లను లీజుకు మాట్లాడి పంపగా, గంగాధర్ కారు కూడా పంపించాడు. కారు మెయింటనెన్స్, ఇన్సూరెన్స్ చెల్లింపు, ఆయిల్ చేంజ్, టైర్లు, డ్రైవర్ జీతం మొత్తం సదరు కంపనీయే భరిస్తూ నెలకు రూ.20 వేలు ఓనరుకు ఇచ్చేవిధంగా ఐదేళ్ల అగ్రిమెంట్ చేసుకున్నాడు. దళితబంధుతో గంగాధర్ కారుకు ఓనరవడమే కాకుండా నెలకు రూ.20 వేలు సంపాదించుకునే అవకాశం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
– ధర్మపురి, ఆగస్టు 28
బేషరతుగా క్షమాపణ చెప్పాలి..
దళితుల అభివృద్ధిని ఓర్వలేక దళితబంధు పథకంపై వక్రంగా మాట్లాడిన ఓ చానల్ ఎండీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అగ్రవర్ణాలకు వంతపాడుతూ, కులమతాల పేరుతో దేశంలో విధ్వంసాలు సృష్టిస్తున్న వారికి అండగా ఉంటూ మీడియాకు చెడ్డపేరు తెస్తున్న ఆయన దళిత బంధు గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై, నిత్యం ప్రజల బాగు కోసం గొప్ప గొప్ప కథనాలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక గురించి హేళనగా మాట్లాడడం అతడి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. దళితబంధు ఉచితం అనడం, ఒకే కుటుంబానికి రూ.10 లక్షలు ఎలా ఇస్తారని హేళనగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం.
– తప్పెట రమేశ్, దళిత సంఘం నాయకుడు, ఎలుబాక(వీణవంక)
దళితులపై వివక్షపూరిత వ్యాఖ్యలు
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సీఎం దళితుల బాగు కోసం ఆలోచించి దళిత బంధులాంటి స్కీం తీసుకురాలె. కానీ కేసీఆర్ తెచ్చారు. ఇందుకు ఓ చానల్ ఎండీగా అభినందించాల్సింది పోయి అవమానించేలా మాట్లాడడం బాగాలేదు. ఇది ముమ్మాటికీ దళితులపై వివక్షే. దళిత బంధు తీసుకున్న లబ్ధిదారులు దుకాణాలు, ఇతర యూనిట్లు నడుపుకుని సంతోషంగా కుటుంబాలకు పోషించుకుంటున్న విషయంపై ఒక్కనాడు ప్రస్తావించని నీవు, ఇపుడు కోడిగుడ్డుమీద ఈకలు వెదికే పనిలో ముందున్నావ్. ఇది కరెక్ట్ కాదు.
– సుదామల్ల సురేందర్, దళితబంధు లబ్ధిదారు, పదిర, ఎల్లారెడ్డిపేట
దళిత వ్యతిరేకివి నువ్వు
ఓ చానల్ ఎండీ అయిన నీవు దళిత వ్యతిరేకివి. దళితులకు దళిత బంధు ఎలా ఉచితంగా ఇస్తారు అనడం కరెక్టు కాదు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం దళితు బంధు పథకం ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ విషయంలో నీకు దళితులు ప్రజా క్షేత్రంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం. జీవిత కాలం నీవు దళిత ద్రోహిగా మిగలుతావు. నీకు అందుకు తగిన శాస్తి తప్పదు. బేషరతుగా దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి, లేకుంటే అందోళన తప్పదు.
– పర్లపల్లి వేణుగోపాల్, ఎంపీపీ, బోయినపల్లి (రాజన్న సిరిసిల్ల జిల్లా)
మూల్యం చెల్లించుకోక తప్పదు
ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇంకా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న నమస్తే తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే నీకు లేదు. చానల్ ఎండీగా ఉండి అలా మా ట్లాడడం సరికాదు. అసలు నీ చా నల్లో ఎప్పుడైనా నిజాలు చెప్పావా..? చూపించావా..? నీకు అనుకూలంగా ఉన్న వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ నువ్వు ఏం చేస్తున్నావో.. తెలంగాణ ప్రజలకు తెలుసు.
– కత్తెరపాక కొండయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు (బోయినపల్లి)
దళితులపై ఇంత విద్వేషమా
దళితులపై ఇంత విద్వేషమా..?, సమాజానికి మంచిని అందించే ఓ మీడియాకు ప్రతినిధి అయి ఉండి అణగారిన వర్గాలపై ఇంత అక్కసు ప్రదర్శించడం సరైన పద్ధతి కాదు. మీదికి నీతులు చెప్తూ లోపల గోతులు తవ్వడమంటే ఇదే. ఏండ్ల తరబడి ఆర్థికంగా వెనుకబడిన దళిత జాతిని ఏ పార్టీ, ఏ నాయకుడూ పట్టించుకోలేదు. కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారు. ఇన్నేండ్లకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళితుల బతుకులు బాగుజేయాలని దేశంలో ఎక్కడా లేని పథకాన్ని తీసుకువచ్చి పాలేర్లను ఓనర్లను జేసిండు. వలస పోయినోళ్లు సొంతూళ్లకు తిరిగచ్చి సొంతంగా వ్యాపారం చేసుకుంట బతుకుతన్రు. ఇది ఓర్వలేని ఆ చానల్ ఎండీ వంకరమాటలు మాట్లాడుతూ దళితులను అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోం. బీజేపీకి, నరేంద్ర మోదీకి వంతపాడుతూ పబ్బం గడుపుకుంటున్న ఆయనకు దళితబంధు గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.
– తాండ్ర శంకర్, దళిత సంఘం నాయకుడు, చల్లూరు(వీణవంక)
కుటిల బుద్ధికి నిదర్శనం
ఓ చానల్‌కు యజమాని అయి ఉండి దళితుల పట్ల అవహేళనగా మాట్లాడిన తీరు, అతడి అగ్రవర్ణ దురాహంకారాన్ని తెలుపుతుంది. దళిత బంధును అవహేళనగా మాట్లాడడం సహించరాని నేరం. తెలంగాణలో దళిత జాతిని ఉద్ధరించాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం నేడు మంచి ఫలితాలనిస్తున్నది. ఈ పథకాన్ని చిన్నచూపు చూస్తుండడమే కాకుండా నమస్తే తెలంగాణ పత్రికను కూడా అవహేళన చేయడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శం. తెలంగాణ ఆకాంక్షను అందిపుచ్చుకొని ఉద్యమ పత్రికగా వెలుగులోకి వచ్చిన నమస్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించింది. అలాంటి పత్రిక పట్ల అవహేళనగా మాట్లాడడం ఆయన కుటిల బుద్ధికి నిదర్శనం. అసత్యపు ప్రచారం మానుకోకపోతే దళిత జాతి తిరుగుబాటు చేయక తప్పదు.
– పసుల స్వామి, తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు, హుజూరాబాద్‌టౌన్.
కనిపించని దేవుడు కేసీఆర్
దళిత బంధు పథకం ద్వారా రూ. పది లక్షలు అందజేయడం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన కనిపించని దేవుడు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దళిత బంధు పథకం ప్రవేశ పెట్టడం దళితుల అదృష్టం. కేసీఆర్‌కు దళితులు ఎంతో రుణపడి ఉంటారు. దళితులు తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా ఆర్థికంగా ఎదిగి సమాజంలో గౌరవ ప్రదంగా జీవించేందుకు ఈ పథకం దోహదపడుతుంది.
– మ్యాదరి శ్రీహరి, మాల మహానాడు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ బాధలను నీ మీడియాలో చెప్పినవా..?
దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నయ్. కూలీకి పోయే దళితులు నేడు దళిత బంధు పథకంతో షాపులను పెట్టుకొని ఓనర్లు అయ్యారు. పేద దళితుల జీవితాలను సీఎం కేసీఆర్ మారుస్తుంటే, ఓ చానల్ ఎండీ దళిత బంధు ఉచిత పథకం అనడం ఎంతవరకు న్యాయం..? ఆంధ్ర పాలనలో నువ్వు పేపర్ నడిపినవు కదా. ఏ ప్రభుత్వం దళితులను ఆదుకున్నదో నువ్వే చెప్పాలి?, నీ చానల్లో తెలంగాణ బాధలను ఎప్పుడైనా చెప్పినవా..? రాష్ట్ర ఏర్పాటుకు నీ మీడియా ఏం చేసిందో గుర్తుచేసుకో? దళిత బంధు ఉచిత పథకం అని ఎట్లంటవ్?. దళిత బంధు, నమస్తే తెలంగాణ పేపర్‌పై మాట్లాడిన నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఏ పోరాటికైనా మేం సిద్ధం.
– బత్తుల పాండు, తెలంగాణ అంబేదర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి, గండ్రపల్లి (జమ్మికుంట రూరల్)
దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నాం
ఆర్థిక అసమానతలు తొలగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బందు పథకాన్ని యావత్ దళిత వర్గీయులు స్వాగతిస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో దళితులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దళితుల ఆర్థిక స్థితిగతులను ఆర్థం చేసుకున్న కేసీఆర్ దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం సత్ఫలితాలిస్తాయనడంలో సందేహం లేదు.
– దూమాల గంగారాం, ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
దళితులకు క్షమాపణ చెప్పాలి
పేదలకు ఇచ్చే పథకం ఉచిత పథకం ఎట్లా అయితది? దళితులను కించపరిచిన ఓ చానల్ ఎండీ అయిన నీవు వెంటనే క్షమాపణ చెప్పాలి. చానల్ ముసుగులో కోట్లు సంపాదిస్తున్నాడు. పేద దళితుల కోసం నీ మీడియా ఏం చేసిందో చెప్పాలి? ఆంధ్ర పాలకుల పాలనలో దళితుల కోసం పదివేలైనా ఇచ్చినారా? తెలంగాణ ఉద్యమం గురించి కథనాలు ప్రసారం చేసినవా..? కేసీఆర్ సార్ దళితులు బాగుపడాలని రూ.10 లక్షలు ఇస్తా ఉంటే, ఉచిత పథకం అంటావా నువ్వు?. దళిత బంధు పథకంతో పేద దళితులు చిన్న చిన్న వ్యాపారాల పెట్టుకొని, సొంతంగా ఓనర్లయ్యే అవకాశం కేసీఆర్ కల్పిస్తుండు. పథకంపై బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంద్ చేయాలి. కించపరిచేలా మాట్లాడిన ఆయనపై కేసులు పెట్టాలి.
– మ్యామల్ల రత్నం, తెలంగాణ మాల హకుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు (జమ్మికుంట రూరల్)