ప్రభుత్వ కార్యాలయాల కరెంట్ బిల్లుల బకాయి పెరిగిపోతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నెలనెలా గుట్టల్లా పేరుకుపోతున్నది. రెవెన్యూ శాఖ పరిధిలోని కార్యాలయాల నుంచి మొదలు కొని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు సంబంధించిన పవర్ చార్జీల చెల్లింపు 20 నెలలుగా నిలిచిపోవడంతో లక్షలు దాటి కోట్లకు చేరిపోయింది. జగిత్యాల జిల్లాలో ఏకంగా రూ.182 కోట్లు పెండింగ్‌లో ఉండిపోగా, విద్యుత్ శాఖపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రభుత్వం నిధులను మంజూరు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ శాఖల సిబ్బంది చెబుతుండగా, ఎలాగైనా బిల్లుల చెల్లింపు జరిగేలా చూడాలని కలెక్టర్‌తో పాటు, సంబంధిత శాఖ అధికారులను ఎన్పీడీసీఎల్ వేడుకుంటున్నది.
జగిత్యాల, మే 31 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు 7096 విద్యుత్ సర్వీసు కనెక్షన్లను ఎన్పీడీసీఎల్ శాఖ ఇచ్చింది. రెవెన్యూ శాఖ పరిధిలో 35 కనెక్షన్లు, అగ్రికల్చర్ మార్కెటింగ్ పరిధిలో 8 సర్వీసులు, రైతు వేదికలకు 70, సివిల్ హాస్పిటల్స్ 4, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 34, వైద్య విద్యాన పరిషత్‌లో 9, మెడికల్ కాలేజీ పరిధిలో 10 సర్వీసులు ఉన్నాయి. అలాగే నర్సింగ్ కాలేజీకి 2 కనెక్షన్లు, పోలీస్ స్టేషన్లకు సంబంధించి 36 కనెక్షన్లు, పోలీసు క్వార్టర్లకు సంబంధించి 220 సర్వీసులు ఉన్నాయి. గ్రామ పంచాయితీ వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించి 5030 కనెక్షన్లు, మున్సిపల్ వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించి 1173 సర్వీసులు, గ్రామ పంచాయితీలకు, 374, మండల పరిషత్ కార్యాలయాలకు 28 కనెక్షన్లు ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ పరిధిలో 43, వాటర్ గ్రిడ్ పరిధిలో 18, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 2 కనెక్షన్లు ఉన్నాయి.
రూ.182.06 కోట్ల బకాయి
జిల్లా వ్యాప్తంగా సర్కారు కార్యాలయాలకు సంబంధించి రూ.182.06 కోట్ల బకాయిలు ఉన్నాయి. 35 రెవెన్యూ కార్యాలయాలు పదహారు నెలలుగా రూ.కోటీ 7లక్షల 29వేల కరెంట్ బిల్లు బకాయి పడ్డాయి. అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ రూ.1.31 లక్షలు, రైతు వేదికలు రూ.9.50 లక్షలు, సివిల్ హాస్పిటల్స్ రూ.కోటీ 35లక్షల 42వేలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రూ.36.34 లక్షలు, వైద్య విద్యాన పరిషత్ రూ.44.09 లక్షలు, మెడికల్ కాలేజీలు రూ.36.56 లక్షల బకాయిలున్నాయి. అలాగే, నర్సింగ్ కాలేజీ రూ.29.56 లక్షలు, పోలీస్ స్టేషన్లకు రూ.46.44 లక్షలు, పోలీసు క్వార్టర్లకు సంబంధించి రూ.81.41 లక్షల బకాయిలు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.34కోట్ల 79లక్షల46వేల బకాయిలు పేరుకుపోయాయి. మున్సిపల్ వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.10కోట్ల5లక్షల 25వేలు బకాయి పడ్డాయి. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సంబంధించి రూ.కోటీ 60లక్షల 62వేలు అప్పుపడ్డారు. మండల పరిషత్ కార్యాలయాలకు సంబంధించి రూ.15.69 లక్షలు, ఇరిగేషన్ శాఖ పరిధిలో రూ.44కోట్ల 36లక్షల 22వేలు బాకీపడ్డారు. వాటర్ గ్రిడ్‌కి సంబంధించి రూ.32.28 కోట్లు బకాయిలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.53.52 కోట్లు కరెంట్ బిల్లుల బకాయిలున్నాయి.
పల్లె, పట్టణ ప్రగతి నిధులు ఆగిపోవడంతో పెరిగిన బకాయిలు
పల్లె, పట్టణ ప్రగతి నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలకడంతోనే గ్రామ పంచాయతీలకు సంబంధించిన కరెంట్ బిల్లుల బకాయిలు పెరిగిపోయాయని గ్రామ పంచాయితీ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. గతంలో వచ్చిన నిధులు సక్రమంగా రాకపోవడం వల్లే తమకు చెల్లింపులు జరగడం లేదని విద్యుత్‌శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి పేరిట కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు జనాభా ఆధారంగా నేరుగా నిధులు ఇస్తూ వచ్చారు.
పల్లె, పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరేవి. ఈ రెండు నిధులతో పాటు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల సాధారణ నిధులతో గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల నిర్వహణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించిన కరెంట్ బిల్లులు ప్రతి నెలా క్లియర్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం కరెంట్ బిల్లులు సైతం చెల్లించలేని దైన్యం నెలకొంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కలిపి దాదాపు రూ.45 కోట్ల బకాయి పడ్డాయి. ఈ విషయమై గ్రామ పంచాయితీ అధికారులు మాట్లాడుతూ, తాము ఏం చేయలేకపోతున్నామని, అసలు నిధులే లేవని, కనీసం ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులు సైతం చెల్లించే స్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ సమకూరే జనరల్ ఫండ్‌తో సిబ్బందికి జీతాలు ఇవ్వగలుగుతున్నామే కానీ, ఇతర అభివృద్ధి, పనులు, బకాయిల చెల్లింపులు చేయలేకపోతున్నామని చెబుతున్నారు.
ప్రభుత్వం మంజూరు చేస్తలేదు.. మేమేం చేయలేం
సార్. సర్కార్ బిల్లులు మంజూరు చేయడం లేదు. అందుకే కరెంట్ బిల్లులు చెల్లించలేకపోతున్నాం. మమ్మల్నేం చేయమంటారని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లులు బకాయి పడిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అన్ని కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఒక కీలక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు నోటీసు ఇస్తూ బిల్లులు చెల్లింపులు జరిగేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంలో కీలక శాఖ ఉద్యోగి మాట్లాడుతూ, ‘సార్ ప్రతి నెలా కరెంట్ బిల్లులకు సంబంధించిన రిసీట్లు రాగానే బిల్లులు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నాం.
ప్రభుత్వం నుంచి నిధుల చెల్లింపునకు అంగీకారం రావడం లేదు. బిల్లు మంజూరు కావడం లేదు. దాంతో ఏం చేయలేకపోతున్నామని’ పేర్కొన్నారు. గతంలో ప్రతి నెలా బిల్లులు చేసి పంపగానే ప్రభుత్వం కరెంట్ బిల్లుల చెల్లింపునకు అనుమతితో పాటు, నిధులు ఇచ్చేదని, ఇప్పుడు అలా జరగడం లేదని సదరు ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 నెలలుగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు బకాయిలు పెట్టడం వల్ల విద్యుత్‌శాఖ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటుందని ఎన్పీడీసీఎల్ అధికారులు అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్యంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వారు పేర్కొంటున్నారు.