కరీంనగర్,నవంబర్ 1(నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్ : కుల గణనలో క్షేత్రస్థాయిలో తప్పు డు సమాచారం నమోదు చేసినా, ఇచ్చినా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. రా ష్ట్రంలో కులగణన అనేది ఒక బృహత్తర కార్యక్రమమని, దాని తర్వాత బీసీలు ఎంత శాతం ఉన్నారనేది తెలుస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యా ప్తంగా 90 వేల మంది ఎన్యుమరేటర్లతో కుల గణన చేపడుతున్నట్లు తెలిపారు.
పూర్తిగా రాజకీయాలకతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి పార్టీలు సహకరించాలని కోరారు. తమ కమిషన్‌కు అడ్వొకేట్ జనరల్ కూడా సలహాలు, సూచనలు చేస్తున్నారని, బిహార్, కర్నాటక రాష్ర్టాల మాదిరి కాకుండా బీసీల తక్షణ న్యాయం జరిగేలా తమ కమిషన్ రిపో ర్టు ఉంటుందని వెల్లడించారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన అక్కడి ఓసీ కులాలు ఇక్కడ బీసీ సర్టిఫికెట్లు పొందుతున్న విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమని, తెలంగాణలో కూడా కొందరు బీసీలు కాకున్నా ఆ కులాలుగా నమోదు చేయించుకుంటున్నారని, ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.
కుల గణనలో కుటుంబ సభ్యులు అందరూ ఉండాల్సిన అవసరం లేదని, కుటుంబంలో ఒకరు ఉండి ఆధార్ కార్డు ఆధారంగా ఎన్యుమరేటర్లకు వి వరాలు అందిస్తే సరిపోతుందని చెప్పారు. రా ష్ట్ర జనాభాలో బీసీల సంఖ్య తేల్చేందుకే సమగ్ర ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సమావేశంలో కలెక్టర్లు ప మేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సత్యప్రకాశ్, ఆర్డీవో మహేశ్‌కుమార్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.