పెద్దపల్లి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు సంబంధించి ఉద్యోగుల సిపిఎస్ ఖాతాలో ఎట్టకేలకు డబ్బులు జమ అయ్యాయి. గత పది నెలలుగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసే భోధన, భోధనేతర సిబ్బంది, ఉద్యోగుల జీతాల నుండి మినహాయించిన సొమ్మును ఇతర అవసరాలకు మళ్ళించి ఉద్యోగులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ వారి బాధను కండ్లకు కడుతూ ‘పది నెలలుగా జమకాని సీపీఎస్ సొమ్ము’ ఆందోళనలో సాంఘిక సంక్షేమ గురుకుల సిబ్బంది.. పేరుతో మెయిన్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ వార్త రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖను ఒక్క కుదుపు కుదిపింది. దీంతో గంటల వ్యవధిలోనే ఉదయం శుక్రవారం ఉదయం 12గంటల కల్లా గురుకుల ఉద్యోలు, భోధన, భోధనేతర సిబ్బందికి సీపీఎస్ ఖాతాల్లో సీపీఎస్ సొమ్మును జమ చేశారు. డబ్బులు జమ చేసినట్లు నేరుగా ఉద్యోగులు వారి వాట్సాప్ గ్రూపుల్లో, వ్యక్తిగతంగా సైతం మెసేజ్‌లు పెట్టారు. గత 10 నెలలుగా సీపీఎస్ సొమ్ము ఎన్పీఎస్ ఖాతాలో జమ కాకపోవటంతో దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగులు కోల్పోవడం ద్వారా వారి రిటైర్మెంట్ లైఫ్ దారుణంగా మారబోతున్నదని, ఫైనాన్స్ ఆఫీసర్ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ఫండ్‌ను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని, పీఎఫ్ ఆర్డీఏ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అథారిటీ) ప్రకారం ఈ కాంట్రిబ్యూటర్ పెన్షన్స్‌కు సంబంధించి ఉద్యోగుల జీతాల నుండి మినహాయించిన సొమ్మును ఏ నెలకు ఆ నెల సకాలంలో ఉద్యోగుల ఎన్పీఎస్ పీఆర్ఏఎన్ ఖాతాలో జమ చేయాల్సి ఉన్నా చేయడం లేదంటూ ఆ కథనంలో పేర్కొనడం జరిగింది.
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఇష్టా రీతిన తమకు తోచినప్పుడు 6 నెలలకు 10నెలలకు ఒకసారి జమ చేస్తున్నారని, దీనివల్ల ఉద్యోగులు స్టాక్ మార్కెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని, వడ్డీని కోల్పోతున్నారని, ఇదేమని ప్రశ్నించిన ఉద్యోగులను ఫైనాన్స్ ఆఫీసర్ ఈసడించుకుంటున్నారని, అడిగిన వారిని వివిధ రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారనే విషయాన్ని సైతం నమస్తే కథనంలో పేర్కొనడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. కొత్త సెక్రటరీ ఈ విషయాన్ని సీజయస్గా తీసుకొని వెంటనే డబ్బులను జమ చేయించారు. 10నెలలుగా సిపిఎస్‌ను తమ ఖాతాలో సకాలంలో జమ చేయకపోవడం వల్ల దీర్ఘకాలంలో తమకు రావలసిన పెన్షన్ బెనిఫిట్స్ రాకుండా పోతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటుగా రాష్ట్రంలో మిగిలిన మహాత్మాజ్యోతిరావు పూలే, గిరిజన, మైనార్టీ సంక్షేమ అన్ని గురుకుల సొసైటీలలో ఏ నెలకు ఆ నెల జమ చేస్తున్నప్పటికీ తమ పట్ల మాత్రం ఇలా చేయడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ ఆఫీసర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని తెలియజేయడంతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో కూడా తమ జీతాల నుండి మినహాయించిన సొమ్మును ఎన్పీఎస్ ఖాతాలో జమ చేయకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. నమస్తే తెలంగాణ కథనం ప్రచురితమైన గంటల వ్యవధిలోనే తన సీపీఎస్ ఖాతాల్లో 10నెలలకు సంబంధించిన సీపీఎస్ సొమ్మును జమ చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. తమ బాధను కండ్లకు కట్టినట్లు వివరించిన నమస్తే తెలంగాణకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.