టెండర్ నోటిఫికేషన్ ఇస్తే.. బిడ్స్ వేసే గడువు ముగిసిన తర్వాత టెండర్లు ఓపెన్ చేసి, నిబంధనల మేరకు ఆయా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం సాధారణం. కానీ, అక్రమాలకు అడ్డాగా మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ నగరపాలక సంస్థలో అందుకు విరుద్ధంగా నడుస్తున్నది. ‘ముడుపులు’ వస్తే టెండర్లు తెరిచి కాంట్రాక్టర్లకు అప్పగించడం, లేదంటే సాంకేతిక సమస్యల సాకు చూపి నెలల తరండి పెండింగ్‌లో పెడుతున్నట్టు తెలుస్తున్నది. అనుకున్న వారికీ రాకున్నా జాప్యం చేయడం, గడువు ముగిసిన రద్దు చేస్తున్నట్టు తెలిసింది. డ్రాయింగ్ బ్రాంచ్ (డీబీ సెక్షన్)లో ఇంజినీరింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలుండగా, అనేక టెండర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే నగరాభివృద్ధికి బ్రేకులు పడుతూనే ఉన్నది.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 21 : కరీంనగర్ నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య కమీషన్ల దందా ఇటీవల జోరుగా సాగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ‘ముడుపులు’ ముడితేనే ఫైల్ ముందుకు సాగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ల నిర్వహణ విషయంలో ముందస్తు ఒప్పందాలతో అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు పిలిచినా అధికారులు అనుకున్న వారికి టెండర్ వచ్చే అవకాశం లేకపోతే నెలల తరబడిగా వాటిని పెండింగ్‌లోనే పెడుతున్నారని తెలుస్త్నునది. రెండు నెలల కిత్రం నగరానికి తీవ్ర సమస్యగా మారిన డంప్‌యార్డులో రూ.2 కోట్ల వ్యయంతో బయోమైనింగ్ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. గడువు దాటి పోయి నెలలు గడుస్తున్నా ఈ టెండర్ పక్రియ మాత్రం పూర్తికాలేకపోయింది. టెండర్ నోటిఫికేషన్‌కు ముందుగానే ఓ సంస్థతో అధికారులు మూముళ్ల ఒప్పందాలు చేసుకుని తీరా టెండర్ టెక్నికల్ బిట్స్ ఓపెన్ చేస్తే వేరే వారికి వచ్చే అవకాశం ఉండడంతో నెలల తరబడిగా దానిని పెండింగ్‌లో పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఓ సంస్థకు అప్పగించేందుకు అధికారులు ప్రయత్నం చేశారని తెలుస్తున్నది. కేవలం తమకు ముడుపులు ఇచ్చే సంస్థకు పనులు రావడం లేదన్న కారణంతోనే ఈ టెండర్‌ను మరుగున పడేసినట్టు తెలిసింది. ఇలాగే, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను కూడా ఆయా కాంట్రాక్టర్లకు అప్పగించే విషయంలో ఈ విభాగం అధికారులు తాత్సారం చేస్తున్నారని తెలుస్తున్నది.
టెండర్లను ఖరారు చేసి నిబంధనల మేరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే విషయంలో పని చేయాల్సిన డీబీ సెక్షన్ అక్రమాలకు నిలయంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విభాగంలో అగ్రిమెంట్ చేయాలన్నా.. పనులు చేసిన ఎంబీ రికార్డులు ముందుకు సాగాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల మేరకు టెండర్లు పూర్తయిన వాటికి సంబంధించి పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన పత్రాలు అందించే విషయంలోనూ ఈ విభాగం సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కమీషన్లు ముడితే తప్ప టెండర్లు పూర్తి చేయడం లేదని.. సాంకేతిక సమస్యల పేరుతో పనులు పెండింగ్‌లో పెడుతున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అధికారులు తాము అనుకున్న వారికి పనులు రాకపోతే ఏకంగా ఈ టెండర్ ఫైల్స్‌ను 90 రోజుల మేరకు పెండింగ్‌లో పెట్టి, గడువు ముగిసిందన్న పేరుతో రద్దు చేయడం అలవాటుగా మార్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో జిల్లా యంత్రాగం, బల్దియా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.