Godavarikhani | కోల్ సిటీ, జూలై 14 : రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయంలో కార్పొరేటర్లకు కనీసం వేటింగ్ హాలు కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు కార్యాలయంలో కుర్చీలు వేసుకొని బైఠాయించారు. డివిజన్లలో ప్రజా సమస్యలు, ఇతరత్రా పనుల నిమిత్తం అధికారులను కలవడానికి కార్యాలయానికి వస్తే ఎవరూ అందుబాటులో ఉండటం లేదని, అధికారుల కోసం వేచి ఉండడానికి కనీసం పాలు కూడా కేటాయించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్లకు వెయిటింగ్ హాలు కేటాయించి సముచిత ప్రాధాన్యత కల్పించిన అనుభవాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇలాంటి దుస్థితి రావడం అవమానకరంగా భావిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల ఛాంబర్లలో టేబుల్ ల ఎదుట కుర్చీలు తీసివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంచార్జి కమిషనర్ అరుణశ్రీ వచ్చి వెయిటింగ్ హాలు కేటాయించేంతవరకు తగ్గేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ స్పందించి ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల గడువులు ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో కార్యాలయంలో మెమోరాండం అందజేసి ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. కాగా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు సైతం ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు.