Conveyor operator | యైటింక్లయిన్ కాలనీ, అక్టోబర్ 18: ఒకే గమ్యం.. ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం.. ఇది సింగరేణి నినాదం. ఇది గోడ రాతలకు మాత్రమే పరిమితం అవుతుందని సింగరేణి రామగుండం-3 డివిజన్ ఓపెన్ కాస్ట్ -1 ప్రాజెక్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. కింది స్థాయి అధికారుల ఆజమాయిషీతో కన్వేయర్ ఆపరేటర్ పదోన్నతుల్లో పారదర్శకత లోపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1 ప్రాజెక్టు సీహెచ్ పి లో కన్వేయర్ ఆపరేటర్ పదోన్నతులకు ఇటీవల యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎంపిక ప్రక్రియలో పలువురు సీనియర్ కార్మికులకు అన్యాయం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రాజెక్టులో పని చేస్తున్న అర్హులైన కార్మికులచే 8 పోస్టులకు నియామకాలు చేపట్టాల్సి ఉంది. కాగా వాటిలో ముగ్గురు ఎస్టీ రిజర్వేషన్ ప్రాతిపదికన నియమించాల్సి ఉంది.
మిగతా ఐదుగురిని జనరల్ కేటగిరిలో యాక్టింగ్ పద్ధతిన భర్తీ చేయాల్సి ఉండగా, జనరల్ కేటగిరి నియామకాల్లో కింది స్థాయి అధికారులు పారదర్శకత పాటించడం లేదని సెక్షన్ కార్మికులు ఆరోపిస్తున్నారు. కన్వేయర్ బెల్టు సెక్షన్లో పని చేసి అనుభవం కలిగిన కార్మికులను గాకుండా ఇతర సెక్షన్లలో పని చేస్తున్న కార్మికులకు పదోన్నతులు ఏలా కట్టబెడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై విజిలెన్స్ అధికారుల దృష్టికి కూడా తీసుకవెళ్లినట్లు తెలిసింది. ఏలాంటి అనుభవం లేని అనర్హులైన కార్మికులకు కన్వేయర్ బెల్టు ఆపరేటర్ గా నియమిస్తే భవిష్యత్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఈ అన్యాయంపై హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు ఓసీపీ-1 అధికారులపై యాజమాన్యంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆపరేటర్ పదోన్నతులకు ఎంపిక ప్రక్రియలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని యాక్టింగ్ పద్ధతిన పారదర్శకంగా నియామకాలు జరిగేలా సత్వర చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.