బీజేపీలో టికెట్ల కల్లోలం రేగుతున్నది. సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ రాణిరుద్రమకు ఇవ్వడంపై అసమ్మతి రగులుతున్నది. ఆ పార్టీ అధిష్టానంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి రమాకాంతరావు, ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్న, సిరిసిల్లకు చెందిన గడ్డం నాగరాజు పార్టీని వీడగా, సోమవారం బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి, రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అన్నల్దాస్ వేణు 50 మంది నాయకులతో కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీకి గుడ్‌బై చెప్పడమే కాదు, అమాత్యుడు రామన్నకు మద్దతు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మరోవైపు ఓయూ విద్యార్థి, తెలంగాణ ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్నతోపాటు ప్రజా కాంగ్రెస్, వివిధ సంఘాల నాయకులు కూడా పెద్ద సంఖ్యలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. చేరికలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తుండగా, ఇతర పార్టీల్లో నాయకుల తీరును చూసి కార్యకర్తలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
– రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్: ఎన్నికలకు ముందే సిరిసిల్ల బీజేపీలో టికెట్ కల్లోలం మొదలైంది. సీనియర్లను కాదని, రాణిరుద్రమను సిరిసిల్ల అభ్యర్థిగా ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో కాషాయంలో కలకలం మొదలైంది. పార్టీ అధిష్టానంపై నిరసన వ్యక్తం చేస్తూ, రాజీనామాల పర్వంగా కొనసాగుతున్నది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి రమాకాంతరావు మొదటగా రాజీనామా చేయగా, ఆయన బాటలో ఓయూ విద్యార్థి తెలంగాణ ఉద ్యమ నాయకుడు దరువు ఎల్లన్న, సిరిసిల్లకు చెందిన గడ్డం నాగరాజు మానకొండూరు టికెట్ ఆశించారు. వీరికి టికెట్ ఇవ్వకపోవడంపై పార్టీకి రాజీనామా చేశారు. రెండురోజుల క్రితం వీరు రాజీనామా చేయగా, తాజాగా సోమవారం బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి అన్నల్దాస్ వేణు 50 మంది యువకార్యకర్తలతో కలిసి బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ, ప్రాథమిక సభ్యత్వానికి ముఖ్యమైన కార్యకర్తలంతా రాజీనామాలు చేస్తుండడంతో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలంతా అయోమయానికి గురవుతున్నారు.
బీజేపీ మాజీ అధ్యక్షుడు జిల్లా అధికార ప్రతినిధి అన్నల్దాస్ వేణు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, పట్టణ అధ్యక్షుడు మల్కపేట భాస్కర్, తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు సురు వు వెంకటి, దళిత నాయకులు కంసాల మల్లేశం, సాయికృష్ణ, గడ్డం హరీశ్, ఎల్లం, అభిలాశ్, బొల్లి నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండ ప్రతాప్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంచర్ల రవితోపాటు 200మంది నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మున్సిపల్ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు సంకపాక మనోజ్, దిడ్డి శ్రీనివాస్, ఎండీ సత్తార్, నాయకులు నామ్యాన రవి, బొల్లి రామ్మోహన్ ఉన్నారు.
సిరిసిల్లతో ఎలాంటి సంబంధం లేని రాణిరుద్రమకు టికెట్ కేటాయించడంపై బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి, రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అన్నల్దాస్ వేణు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం 50 మంది నాయకులతో కలిసి పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు. అనంతరం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీలో 2008 నుంచి సైనికుడిలా పనిచేశానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ఉద్యమ కాలంలో రాష్ట్ర సాధనతో పాటు జిల్లా ఏర్పాటు సమయంలోనూ భాగస్వాములయ్యాన్నారు. నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో అనేక పోరాటాలు చేశామన్నారు.
తనతోపాటు యువ నాయకులపై ఉద్యమ కేసులు ఉన్నాయని చెప్పారు. ఎలాంటి సంబంధం లేకుండానే బండి సంజయ్ నాయకత్వాన్ని మార్పు చేశారన్నారు. జాతీయ నాయకత్వం సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ కేటాయించే సమయంలో స్థానిక నాయకులను కనీసం సంప్రదించకపోవడం విచారకరమన్నారు. కనీస గౌరవం లేని పార్టీలో కొనసాగబోమని, తమ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి 50 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో బీజేపీ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు సురువు వెంకటి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బూర విష్ణు, పట్టణాధ్యక్షుడు భాస్కర్, కంసాల మల్లేశం, సిరిసిల్ల సాయికృష్ణ, హరీశ్ ఉన్నారు.