రూ.12.50 లక్షల సుడా నిధులతో రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటు రచ్చరచ్చ అయింది. అప్పటివరకు గోప్యంగా ఉన్న ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ శుక్రవారం వెలుగులోకి తేవడం చర్చనీయాంశమైంది. ‘సర్కారు నిధులతో రాజీవ్ గాంధీ విగ్రహం?’ శీర్షికన ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల కేటాయింపుపై వివిధ పార్టీలు భగ్గుమన్నాయి. ఆ ప్రతిపాదనలకు అమోదం తెలిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నిధుల కేటాయింపు విషయం వివాదం కావడంతో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) అధికారులు దిద్దుబాటు దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిసింది.
కరీంనగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణప్రతినిధి) : కరీం‘నగరం’ నడిబొడ్డున రాజీవ్‌చౌక్‌లో గతంలో ఉన్న రాజీవ్‌గాంధీ పాత విగ్రహన్ని పక్కన పెట్టి.. కొత్తగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహం తయారీకి సుడా నుంచి రూ.12.50లక్షల నిధులు కేటాయించారు. అందుకోసం టెండర్లు పిలిచి, విగ్రహాన్ని తెప్పించారు. ఇన్నాళ్లూ గోప్యంగా ఉన్న ఈ విషయాన్ని శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల కేటాయింపు, అందులో లోపాలు, ఏ విగ్రహాలకు సర్కారు సంస్థల నుంచి వినియోగించుకునే అవకాశాలు.. వంటి అంశాలను ‘నమస్తే’ కండ్లకు కట్టినట్టు వివరించింది. ‘సర్కారు నిధులతో రాజీవ్‌గాంధీ విగ్రహం?’ శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రధాన పార్టీలను తట్టిలేపింది. దీంతో అన్నీ పార్టీలు సుడా నిర్ణయాన్ని తప్పు పట్టడం, వివాదం కావడంతో సుడా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది. మొదట టెండర్లు మాత్రమే పిలిచామని, ఆ తర్వాత నిలిపివేశామని చెప్పే దిశగా చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో తప్పించుకోవడానికి, అలాగే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సుడా కొత్త వ్యూహంలో భాగంగా తప్పును సవరించే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిసింది. టెండర్ నిబంధనల ప్రకారం విగ్రహాన్ని తయారీ చేసి ఇచ్చిన కాంట్రాక్టర్ బిల్లు కోసం డిమాండ్ చేస్తే.. మున్ముందు చెల్లిస్తారా.. లేదా..? అన్న దానిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

రాజీవ్‌గాంధీ విగ్రహం తయారీ కోసం రూ.12.50 లక్షలు కేటాయించినట్టు ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ పేపర్లో చూశాను. నాకు తెలిసినంత వరకు ఇది నిబంధనలకు విరుద్ధమే. ఎందుకంటే నేను మేయర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ చౌక్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఆనాడు విగ్రహం తయారీకి కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి అవకాశం లేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం మాత్రం నిధులు కేటాయించారు. ఆనాడు సహకరించని నిబంధనలు.. ఈరోజు ఎలా సహకరించాయి? నిజానికి ఇలా పెట్టేది ఉంటే.. ముందుగా మన ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ, దక్షిణ భారతదేశం నుంచి అయిన తొలిప్రధాని పీవీ విగ్రహం పెట్టాలే తప్పా రాజీవ్గాంధీది కాదు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని మున్ముందు మరింత మాట్లాడుతా.
రాజీవ్‌గాంధీ విగ్రహం తయారీ కోసం ముందుగా నిధులు కేటాయించిన విషయం వాస్తవమే. కానీ, ఆ తర్వాత నిధులు ఇవ్వరాదన్న విషయం తెలిసింది. ఆ మేరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించిన బిల్లు చెల్లింపులు చేయడం లేదు. ఎంబీ రికార్డు చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విగ్రహం తయారీ ఖర్చులను ప్రైవేటు వ్యక్తులే పెడుతున్నారు. కేవలం రాజీవ్‌చౌక్ సుందరీకరణకు మాత్రమే సుడా నిధులు ఇస్తాం.
ప్రభుత్వం అధికారంలో ఉందని ప్రజాధనం దుర్వినియోగం చేస్తే.. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో అనేక చౌరస్తాలను ప్రభుత్వ నిధులతో సుందరీకరించాం. కానీ, ఏ ఒక్క విగ్రహ తయారీకి కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించలేదు. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా రాజీవ్‌గాంధీ విగ్రహం తయారీకి రూ.12.50 లక్షల నిధులను సుడా నుంచి ఎలా కేటాయిస్తారు? వాళ్లకు అధికారం ఎక్కడున్నది? ఇది పూర్తి నిబంధనలకు విరుద్ధం. ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి టెండర్లు పిలిచిన విషయంపై ముందుగా విచారణ చేయాలని కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశాం. విచారణలో తెలిసిన అంశాల ఆధారంగా నిబంధనలను పక్కన పెట్టి నిధులు కేటాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఆందోళన తప్పదు. ఒకవేళ నిబంధనలుంటే ముందుగా మాజీ ప్రధాని పీవీ విగ్రహం ఏర్పాటుకు నిధులు కేటాయించాలి. లేకుంటే రాజీవ్‌గాంధీ విగ్రహం తయారీ కోసం కేటాయించిన నిధులను వెంటనే రద్దు చేయాలి. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులపై చర్యలు తీసుకోవాలి. దీంతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది.
కరీంనగర్ జిల్లా నుంచి దేశ ప్రధానిగా ఎదిగి, దేశగతిని మార్చడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించేలా కాంగ్రెస్ వ్యవహరించింది. ప్రభుత్వ నిధులతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ.. పీవీ విగ్రహాన్ని విస్మరించింది. ఇది పార్టీ ద్వంద్వ నీతి బయట పెడుతున్నది. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పీవీ విగ్రహంపై ఎందుకులేదో చెప్పాలి. ఈ గడ్డపై పుట్టిన భారత రత్న పీవీ విగ్రహానికి సర్కారు నిధులు ఇవ్వకపోవడంలో ఆంతర్యం, అభ్యంతరం ఏమిటో ముందుగా ప్రజలకు చెప్పాలి. పీవీ విగ్రహం పెట్టాలని దశాబ్ద కాలంగా డిమాండ్ ఉన్నా పక్కన పెట్టడం ఎంత వరకు సముచితం? ఇది ఆ పార్టీ దమననీతిని బయట పెడుతున్నది.