Putta Madhukar | పెద్దపల్లి, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): శత్రు దేశాలు కూడా ఈ విధంగా ఎప్పుడు దాడులు చేయలేదని, మన రాష్ట్రంలోని మన నాయకులే మన రాష్ట్ర సంపదను ఈ విధంగా ధ్వంసం చేయడం నిజంగా నీతిమాలిన చర్య అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి మానేరు లో నిర్మించిన చెక్ డ్యామ్ ధ్వంసం కాగా దానిని పుట్ట మధుకర్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెక్ డ్యాములను నాశనం చేయాలని ఆలోచిస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు చెక్ డ్యాం లు అవసరమా అని బహిరంగంగా చాలాసార్లు అన్నారన్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా చెక్ డ్యాములు ధ్వంసమవుతున్నాయన్నారు.
ఇటీవల పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక చెక్ డ్యాం ను బాంబు పెట్టి పేల్చారని, ఆ ఘటన మరువకముందే మళ్లీ మంథని నియోజకవర్గంలోని మంథని మండలం అడవి సోమనపల్లి మానేరు చెక్ డ్యామ్ ధ్వంసం చేశారని విమర్శించారు. ఐదు సంవత్సరాలపాటు 50 ఏళ్లకు సరిపడా డబ్బును సంపాదించాలని కాంగ్రెస్ నాయకులు ఇసుక దోపిడీ చేసేందుకు చెక్ డ్యామును ధ్వంసం చేశారన్నారని మండిపడ్డారు.
అడవి సోమనపల్లి, వెంకటాపూర్ లతోపాటు మానేరు పరీవాహక ప్రాంతం వెంట ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఇసుకను దోచుకునేందుకు ఈ చెక్ డ్యాం ధ్వంసం చేసి ఉంటారని ఆరోపించారు. చెక్ డ్యాం ధ్వంసం పై మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో కాల్ ద్వారా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారని అన్నారు. చెక్ డ్యామ్ ధ్వంసం పై స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.