Balkonda MLA Vemula Prashanth Reddy | రుద్రంగి, అక్టోబర్ 8: గడిచిన రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాలు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీపడ్డ డబ్బుల వివరాలను కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ ద్వారా ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రుద్రంగి మండలం వీరునితండా గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు బుధవారం వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగటానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ బాకీ కార్డు చూయించి బాకి పడ్డ డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని నీలదీయాలన్నారు. ఉమ్మడి మానాల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డులను ప్రజలకు వివరిస్తూ విస్తుతమైన అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగాపత్ తిరుపతి, మానాల పీఎసీఎస్ చెర్మన్ ఏలేటి చిన్నారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, మాజీ సర్పంచ్ మంగిలాల్, గుగులోత్ మేన, నాయకులు నరహరి నాయక్, భూమా నాయక్, నరేష్‌నాయక్, నాయిని రాజేశంలతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.