Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 22: రామగుండం నగర పాలక సంస్థ 12వ డివిజన్ ప్రైవింక్లయిన్ ఏరియాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఒకరు ఖాళీ స్థలాన్ని కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రికి రాత్రే అక్కడ టేలా వెలిసింది. ఈ సంఘటనపై ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా నాయకులు కనకం గణేష్ శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ తోపాటు సింగరేణి ఆర్జీ-1 జీఎంలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఒకవైపు గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్‌లో అభివృద్ధి దిశగా స్థానిక ఎమ్మెల్యే రోడ్ల వెడల్పులో భాగంగా నిర్మాణాలు తొలగిస్తుంటే, అదే పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ మాత్రం ఫైవింక్లయిన్ ఏరియాలో ఖాళీ స్థలం కనిపించడం ఆలస్యం వెంటనే కబ్జా చేసి రాత్రికి రాత్రే షెట్టర్ నిర్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో సైతం ఇదేవిధంగా షెట్టర్లు వేసి ఇతరులకు అమ్ముకున్నాడనీ, ఇప్పుడు కూడా అధికారం అడ్డు పెట్టుకొని మళ్లీ ఒక టేలాను ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. డివిజన్ ప్రజలు అభ్యంతరం తెలిపితే తాము అధికార పార్టీకి చెందినవారమనీ, తమను ఎవరు ఏమీ చేయలేరని దబాయిస్తున్నాడని ఆరోపించారు. నగర పాలక సంస్థ కమిషనర్ స్పందించి వెంటనే రోడ్డు ప్రక్కన వెలిసిన టేలాను తొలగించాలని కోరారు. లేనిపక్షంలో డివిజన్ ప్రజలతో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.