Dava Vasantha | జగిత్యాల, జులై 8: కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని కోరుతూ బీఆర్ఎస్, జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల దుస్థితి ఆధ్వానంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలన రైతు పక్షపాతిగా ఉంటే అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన రైతులపై కక్ష పూరితంగా వ్యవహారిస్తున్నట్లు పాలన సాగుతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి బీడు వారిన నేలలను సిరుల మాగాణిగా మార్చారాని, అలాంటి కాళేశ్వరం పైన అసత్య ప్రచారం చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపు కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఎరువులు, సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు భరోసా, రుణమాఫీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు కష్టం రాకుండా చూసి రైతుల కన్నీరు తుడిచిన రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రుణమాఫీ పూర్తి చేయకుండా భరోసా రెండు పంటలకు ఎగగొట్టి, సకాలంలో యూరియా అందించకుండా రైతులను అరిగోస పెడుతుందన్నారు.కాంగ్రెస్ అంటేనే కరువు అనే మాటను నిజం చేస్తూ, ఆఖరికి ఎరువుల కరువు కు కూడా కాంగ్రెస్ కేరాఫ్ గా నిలిచిందని ఏద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో రైతుల కళ్లలో ఉన్న ఆనందం, నేడు ఈ ప్రభుత్వం పాలనలో కన్నీళ్లను మిగిలిస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందంటే నెలకి రూ.10 వేల కోట్ల అప్పు చేసి ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, ఎరువుల ధరలు తగ్గించాలని, రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, ఏలేటి అనిల్, బర్కం మల్లేష్, తెలు రాజు, మాజీ సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్, నడేం శంకర్, గంగాధర్, సీనియర్ నాయకులు సాగి సత్యం రావు, శీలం ప్రవీణ్, శ్రీధర్ రెడ్డి, గంగారెడ్డి, ప్రశాంత్ రావు, ముత్తయ్య, హరీష్, సన్నిత్ రావు తదితరులు పాల్గొన్నారు.