రాష్ట్రంలో ప్రజా సంక్షేమం గాడి తప్పుతున్నది. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతున్నది. ఎన్నికల ముందు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు చేయూత పథకం కింద పింఛన్ రెండింతలు చేస్తాం.. ఇంట్లో ఇద్దరికి అందిస్తామని నమ్మించి గద్దెనెక్కి, అమలుకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నది. అసహాయులకు అడుగడుగునా రిక్తహస్తమే చూపుతూ, బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఇచ్చిన పింఛన్లనే కొనసాగిస్తున్నది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరదాటిపోయినా సాయం పెంచక, కొత్త పింఛన్లకూ అవకాశం వ్వకపోవడంతో వృద్ధులు, దివ్యాంగుల్లో నైరాశ్యం నెలకొన్నది. ప్రభుత్వం స్పందించి, సాయాన్ని పెంచాలని, అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 19 : అధికారమే ధ్యేయంగా అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే వృద్ధులు, ఒంటరి మహిళలు, అసహాయులకు పెన్షన్ రెట్టింపు చేసి రూ.4,016, దివ్యాంగులకు రూ.6,016 చొప్పున ప్రతి ఇంట్లో అర్హులైన ఇద్దరికీ అందజేస్తామంటూ ప్రకటించి, ఇప్పుడు విస్మరించడంపై ఆయావర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పెన్షన్ రెండింతలు పెంచుతామంటూ మెనిఫెస్టో ద్వారా ప్రకటించడంతో ఆశపడి మద్ధతిస్తే, ఏడాదిన్నర గడుస్తున్నా స్పందన లేదని వాపోతున్నారు. తమను మభ్యపెట్టి ఓట్లేయించుకున్న స్థానిక నాయకులను ప్రశ్నిస్తే, మొండిచేయి చూపుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన విధానాన్ని గమనిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తమకు ఎంతగానో సాయమందించిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఇచ్చిన పింఛనే కొనసాగింపు..
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా వెలుగొందిందనేది నిర్వివాదాంశం. పెన్షన్ల పంపిణీలో దేశంలోని అన్ని రాష్ర్టాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నాయనేది అక్షరసత్యం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో, దశాబ్దకాలం పాటు ఎలాంటి సమస్యల్లేకుండా వీరంతా తమ కుటుంబాలను నెట్టుకొచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా పింఛన్లను మరో వెయ్యి పెన్షన్ పెంచి, అమలు చేసింది.
గతంలో 65 ఏళ్లున్న వారికి మాత్రమే మంజూరయ్యే వృద్ధాప్య పెన్షన్ 57 ఏండ్లకు కుదించి, అమలు చేసింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, ఆసహాయులకు నెలకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ రెట్టింపు చేసి రూ.4016, దివ్యాంగులకు రూ.6016 చొప్పున ప్రతి ఇంట్లో అర్హులైన ఇద్దరికీ అందజేస్తామంటూ ఎన్నికల ముదు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక కూడా చేతులెత్తేసింది.
గత ప్రభుత్వం పంపిణీ చేసిన మొత్తాన్ని మాత్రమే ఇప్పటికీ కొనసాగిస్తోంది. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 1,35,881 మంది వివిధ రకాల పెన్షన్లు పొందుతుండగా, వీరిలో 53,791 మంది వృద్ధులు, 37,221 మంది వితంతువులు, 2,706 మంది చేనేత, 3,680 మంది గీత, 9,546 మంది బీడీ కార్మికులు, 3,427 మంది ఒంటరి మహిళలు, 54 మంది బీడీ టేకేదార్లు, 2003 మంది ఏఆర్టీ, 538 మంది ఫైలేరియా, 118 మంది డయాలసిస్ పేషంట్లు, 22,797 మంది దివ్యాంగులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ మాత్రమే అందుతున్నది.
కొత్త పింఛన్లకు మంగళం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, జిల్లాలో వేలాది మంది అర్జీ పెట్టుకున్నారు. వాటిని పరిశీలించిన జాడ లేదు. కొత్త పెన్షన్ల మంజూరుకు మోక్షం కల్పించలేదు. గతంలో ఇంటిలో పెన్షన్‌దారు మరణిస్తే ఆ పెన్షన్‌ను భార్యకు గానీ, భర్తకు గానీ మళ్లించి కొనసాగించేవారు. ప్రస్తుతం స్పౌజ్ పెన్షన్లకు కూడా అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపోతున్నారు.