జగిత్యాల, అక్టోబర్ 16 : ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఎన్నికల ముందు కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందని, ఇప్పుడు చెల్లని జీవోల పేరిట డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో 420 మోసపూరిత హామీలు, 6 గ్యారెంటీలు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీతో మాట్లాడించారని, తర్వాత మభ్య పెట్టి మోసం చేశారని మండిపడ్డారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల 18న చేపట్టే తెలంగాణ బంద్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మద్దతునిస్తున్నామని స్పష్టం చేశారు. బంద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమయంలో బీసీల పాత్ర ఘననీయమైందని, అలాంటి బీసీలను కాంగ్రెస్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీసీల హకుల మద్దతు కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పారు. బలహీన వర్గాలకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. బీసీలు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్, బీజేపీ కనుమరుగవుతాయని హెచ్చరించారు. బంద్‌కు వ్యాపార, వాణిజ్య వర్గాలు సహకరించాలని కోరారు. ఆ తర్వాత జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, బీఆర్ఎస్ అంటేనే బీసీల పార్టీ అని, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచి కేసీఆర్ బీసీల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. జీవోల ద్వారా హకుల సాధన జరగదని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతుందని, తమిళనాడు తరహా రిజర్వేషన్ల కోసం పోరాడడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. బీసీ బిల్లు ప్రవేశపెడితే బీఆర్ఎస్కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీసీల హకుల విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి బీఆర్ఎస్ తన వంతు కృషి చేసిందని గుర్తు చేశారు. అంతకుముందు జగిత్యాల జిల్లా బీసీ నాయకులు మాట్లాడుతూ, రాజ్యసభలో తమ పార్టీ అభ్యర్థుల మద్దతు ఉంటుందని కేటీఆర్ చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీశ్, వొళ్లెం మల్లేశం, ఆనంద్‌రావు, అనురాధ, శ్రీనివాస్, చింత గంగాధర్, మానాల కిషన్, చెట్టె రాజేశ్వర్, సన్నిత్, దేవేందర్ నాయక్, దావ సురేశ్, ఆదిరెడ్డి, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.