Vemulawada | వేములవాడ, జనవరి 11: వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు చేసిన పత్రాలు, అధికారులు ఇచ్చిన వివరణ పత్రాలను సామాజిక కార్యకర్త పుప్పాల మోహన్ ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని వార్డులలో అక్రమంగా ఇతర గ్రామాల నుండి ఓటర్లు నమోదు చేయించారని అభ్యంతరాలు వ్యక్తం చేశామని తెలిపారు. ఓటర్ ముసాయిదా జాబితాను ప్రకటించిన తర్వాత ఈనెల 8వ తేదీన 11వ వార్డులో దాదాపు 400 పైగా ఇతర గ్రామాల నుండి అక్రమంగా ఓటర్ల నమోదు చేయించారని మున్సిపల్ అధికారులకు వినతిపత్రం ద్వారా ఫిర్యాదు చేశామని తెలిపారు.
జాబితా పై అభ్యంతరం వ్యక్తం చేసిన సదరు అధికారులు ఇప్పుడు ఎన్నికల నిబంధనల మేరకు ఏమీ చేయలేమని సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. ముసాయిదా జాబితాలో అభ్యంతరాలు తెలపాలని ఇచ్చిన తర్వాత మళ్లీ అభ్యంతరాలు తెలిపితే ఏమీ చేయలేమంటే ఎందుకు అభ్యంతరాలు కోరుతున్నారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా వచ్చిన ఓట్ల ద్వారా వార్డ్ రిజర్వేషన్ కూడా తలకిందులయ్యే అవకాశం ఉంటుందని కనీసం దీనిని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం అధికారుల పనితీరును నిరసిస్తూ పత్రాలను కాల్చివేసినట్లు తెలిపారు.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఇప్పటికే ఓటర్ల జాబితా తప్పులు తడకగా ఉందని అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఓటర్లు కూడా ఒక వార్డు నుండి మరొక వార్డుకు ఓటరుకు తెలియకుండానే బదిలీ అయ్యాయి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదుల పరంపరలో భాగంగా ఉప్పాల మోహన్ ఏకంగా అధికారుల కు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు వారు ఇచ్చిన సమాధాన పత్రాన్ని కూడా కాల్చివేయడం పట్టణంలో చర్చని అంశంగా మారింది.