కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 3 : సహకార బ్యాంకు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంతోపాటు అన్ని రంగాలకు సేవలందిస్తున్నామని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేడీసీసీబీ 100.10 కోట్ల లాభాలు ఆర్జించిన సందర్భంగా కరీంనగర్‌లోని కేడీసీసీ బ్యాంకు ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడారు. బ్యాంకు సిబ్బంది, వినియోగదారులతో ఉన్న బంధమే ఇన్ని లాభాలను గడించడానికి కారణమైందన్నారు. ప్రభుత్వ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకు పని చేస్తున్నదని, తెలంగాణ బ్రాండ్‌గా మారడం గర్వకారణమన్నారు. 2011 నుంచి లాభాలు ప్రారంభమయ్యాయని, ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతులకు సేవలందించడమే తమ బ్యాంకు లక్ష్యమన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక పంట రుణాలు అందిస్తున్న బ్యాంకు తమదేనని స్పష్టం చేశారు. మొదట్లో పంట రుణాలకే పరిమితమైనా ప్రస్తుతం అన్ని రకాల రుణాలు అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు సైతం లోన్లు ఇస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతా ల్లో హౌసింగ్ లోన్లు, మహిళలకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. సిబ్బంది వ్యవస్థ కోసం పని చేయాలని, పాలసీలకు అనుగుణంగా పని చేయాలన్నారు. పాలకవర్గం శాశ్వతం కాదని, వ్యవస్థే శాశ్వతంగా ఉంటుందన్నారు. త్వరలోనే డ్రెస్‌కోడ్‌పై పాలకవర్గం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ పింగలి రమేశ్, డైరెక్టర్లు వుచ్చిడి మోహన్‌రెడ్డి, గోపాల్‌రావు, రమేశ్, సీఈవో సత్యానారాయణరావు, జనరల్ మేనేజర్ ఉషశ్రీ, డీజీఎంలు వేణుగోపాల్, వెంకటేశ్వర స్వామి, సుమమాల, ఏజీఎంలు, సేల్ ఆఫీసర్స్, మేనేజర్లు, పీల్డ్ ఆఫీసర్లు, ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హన్మంతరావు, సిబ్బంది పాల్గొన్నారు.