Commerce Meet | కమాన్చౌరస్తా, జనవరి 8 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ, పీజీ కళాశాల కామర్స్ క్లబ్ ట్రేడ్ టైటాన్స్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తొలి కామర్స్ మీట్ ‘సినర్జీ’తో నిర్వహించింది. కాగా విద్యార్థులు చేసిన కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ కామర్స్ విభాగ అధిపతి డాక్టర్ డీ హరికాంత్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల కరస్పాండెంట్ వీ రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇక్కడ డాక్టర్ హరికాంత్ మాట్లాడుతూ, వాణిజ్య విద్య ప్రస్తుత అవసరం, భవిష్యత్ అవకాశాలపై వివరించారు.
రవిందర్ రెడ్డి విద్యార్థుల్లో వాణిజ్య విజ్ఞానం, సృజనాత్మక ఆలోచనలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్తు చెప్పారు. ఈ సందర్భంగా జీఎస్టీ ప్రభావం, భారతదేశంలో క్యాష్ లెస్ ఎకానమీ, ఈ-కామర్స్ పాత్ర, వ్యాపార నమూనాల రకాలు వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు నిర్వహించగా, విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక విలువలపై తుది సంవత్సరం విద్యార్థుల గీతం, బీకాం ప్రాముఖ్యతపై స్కిట్ అందరినీ ఆకట్టుకున్నాయి. మెలోడీ మూవ్, యూనిటీ స్ట్రెంగ్త్, రివర్స్ రీజనింగ్, లాజిక్ లింక్ వంటి సరదా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థినులలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.