కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 15 : ఈ నెల 25 నుంచి మే 2 వరకు జరుగనున్న ఓపెన్ సూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ సూల్ పరీక్షల నిర్వహణపై సోమవారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించవద్దన్నారు. పరీక్ష రాసే వారితోపాటు ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా చూడాలన్నారు. ఓపెన్ సూల్ ఎస్సెస్సీకి సంబంధించిన పరీక్ష కేంద్రాలు కరీంనగర్లో రెండు, హుజూరాబాద్‌లో ఒకటి ఏర్పాటు చేస్తున్నామని, ఈ మూడు కేంద్రాల్లో 475 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. అలాగే, ఇంటర్‌కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు కరీంనగర్ లో మూడు, హుజూరాబాద్‌లో రెండు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో 881 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు.
పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేరొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్వో పవన్ కుమార్, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, జిల్లా వైద్యాధికారి సుజాత, డీఈసీ మెంబర్ అశోక్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.