గడ్డిమందు పారాక్వాట్.. వణుకు పుట్టిస్తున్నది. పంట చేలల్లో కలుపు నివారణకు ఉపయోగపడాల్సిన ఈ మందుతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతున్నది. ఇది నేలను దెబ్బతీయడమే కాదు, మానవ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నది. నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతుండడంతో ఆత్మహత్యలకు అత్యంత ప్రమాదకరమైన ఈ గడ్డిమందు ఒక్కటే శరణ్యమన్నట్టుగా మారిపోయింది. ఇది తాగితే విరుగుడు లేదని వైద్యులు చేతులెత్తేస్తుండగా, బతికి బట్టకట్టడం కష్టమేనని తెలుస్తున్నది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను హరించిన ఈ కాలకూట విషాన్ని నిషేధించకపోతే ఇంకా ఎన్నో అనర్థాలు చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇటు మనుషుల ప్రాణాలు హరిస్తూ, అటు పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ మందుపై నిషేధించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కూలీల కొరత ఏర్పడి పంట చేళ్లలో కలుపు నివారణ సమస్యగా మారిన నేపథ్యంలో కొన్ని ఆగ్రో కంపెనీలు పారాక్వాట్, ైగ్లెఫోసైట్ అనే గడ్డిమందును పరిచయం చేశాయి. అయితే ఈ మందులను విచ్చలవిడిగా వాడి ఇప్పుడు పర్యావరణానికి సైతం ముప్పు తెస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రమాదకరమైన ఈ మందుతో కలిగే ముప్పును పసిగట్టిన పాశ్చాత్య దేశాలు చాలా ఏళ్ల కిందనే నిషేధించాయి. మన దేశంలోనూ నిషేధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ైగ్లెఫోసెట్పై 2022లో పాక్షికంగా నిషేధం ప్రకటించినా నామమాత్రమే అయింది. మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ విరివిగా దొరుకుతున్నది. ఇప్పుడు మరో గడ్డిమందు పారాక్వాట్ ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. ఇది నేలను దెబ్బతీయడమే కాదు, మానవ ఆరోగ్యంపైనా పెను ప్రభావం చూపుతున్నది. ఈ పారాక్వాట్ను కలుపు నివారణకు కాకుండా, క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఎంచుకుంటున్నారు. ఇది తాగితే ప్రాణాలు పోవడం మినహా విరుగుడు లేదని వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు. 90 నుంచి 95 శాతం నమ్మకం లేకపోయినా తమ వారిని బతికించుకునేందుకు కొందరు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం లేక పోవడంతో కుటుంబ సభ్యులను కోల్పోవడమే కాకుండా, ఆర్థికంగానూ నష్టపోతున్నారు.
గడ్డిమందు ప్రాణాంతకమని తెలిసినా మార్కెట్లో విరివిగా విక్రయిస్తున్నారు. రైతులకు మాత్రమే అమ్మాల్సి ఉన్నా.. డబ్బులు తీసుకుని ఎవరు అడిగితే వారి చేతిలో పెడుతున్నారు. ఇంత సులువుగా దొరుకుతుండడంతో ఆత్మహత్యలకు పాల్పడే వారు దీనినే ఎంచుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలను బలిగొన్న గడ్డిమందును కట్టడి చేయకపోతే మరింత ప్రాణనష్టానికి కారణం కావచ్చనే అభిప్రాయం వినిపిస్తున్నది. గడ్డిమందు ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరు వస్తే ఈ మందు విక్రయించాలి? అనే ఆంక్షలు ఫర్టిలైజర్ డీలర్లపై లేకపోవడం కూడా ఈ ఉపద్రవానికి కారణంగా కనిపిస్తున్నది. రైతులకు మాత్రమే విక్రయించాలని నిబంధన పెడితే, ఎవరు రైతులో తమకెలా తెలుస్తుందని డీలర్లు వాదిస్తున్నారు. కానీ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల ఆరోగ్యాల గురించి పోరాడుతున్న హెచ్ఆర్డీఏ వంటి సంస్థల ప్రతినిధులు కొన్ని పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన ఒక సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఇపుడు చర్చకు దారి తీస్తున్నది.
గడ్డిమందుపై తక్షణమే నిషేధం విధించాలని హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) గట్టిగా డిమాండ్ చేస్తున్నది. ముఖ్యంగా పారాక్వాట్తో సమాజానికి చాలా ముప్పు ఉందని ఈ అసోసియేషన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. స్వచ్ఛందంగా రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి ఈ అసోసియేషన్ ప్రతినిధులను ఆహ్వానించారు. సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. హెచ్ఆర్డీఏ ప్రతినిధిగా డాక్టర్ రాజ్ కుమార్ బండారి, డాక్టర్ రాకేశ్, డాక్టర్ శరణ్సాయి, గౌతం పసుల పాల్గొని, వ్యవసాయ అధికారులతో చర్చించారు. గడ్డిమందు రైతులకు ఉపయోగ పడేదానికంటే సమాజానికి ఎంతో చెడును చేస్తున్నదని వివరించారు. దీనిపై ఇప్పటికిప్పుడు నిషేధం విధించే పరిస్థితి లేకుంటే.. కొన్ని కఠినమైన నిబంధనలు తెచ్చి విక్రయించాలని సూచించారు. ముఖ్యంగా రిటైలర్లు తప్పని సరిగా హామీ పత్రం తీసుకోవాలని, ఈ మందు అమ్మకాలకు ఒక రిజిస్టార్ నిర్వహించాలని, అందులో వినియోగదారుడి పేరు, ఊరు, వయసు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ వినియోగదారుడి పరిధిలోని ఏఈఓలు, ఏవోలతో మాట్లాడి నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. గడ్డిమందును నిషేధించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అయినప్పటికీ ఈ విధంగా ముందుకెళ్తే కొంత వరకైనా నియంత్రించవచ్చని హెచ్ఆర్డీఏ అసోసియేషన్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
గడ్డిమందుతో కలుపు నివారణ మేలు కంటే ఎక్కువగా అనర్థాలే జరుగుతున్నాయి. ఇది భూమిలోని జీవానికి, భూమిపై మానవాళికి పెను ప్రమాదంగా మారింది. ఈ మందు నేలలో కలిసి నీటిని కలుషితం చేస్తున్నది. భూసారాన్ని దెబ్బతీస్తున్నది. కలుపు మొక్కలతోపాటు పంట మొక్కలపైనా ప్రభావం చూపుతున్నది. దిగుబడి కూడా తగ్గుతున్నది. దీని అవశేషాలు దిగుబడుల్లో చేరి మనుషుల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతున్నది. గడ్డిమందు వాడే రైతులు, కూలీలు చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి అనేక సమస్యల బారిన పడుతున్నారు. ఈ మందును విరివిగా వాడడం వల్ల నేలలోని ఫంగై బ్యాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు నశించి, హ్యూమస్ ఉత్పత్తి నిలిచి పోతుంది. కార్భన్ నిల్వల తగ్గుదలకు దారితీసి గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని పెంచుతుంది. ఇది వాతావరణంలో మార్పులకు పరోక్షంగా కారణమవుతున్నది. ఆత్మహత్యలు చేసుకొనే వారు ఈ మందు తాగితే బతికి బట్టకట్టడం కష్టమే.
పారాక్వాట్ అనే గడ్డిమందును దేశవ్యాప్తంగా నిషేధించాలి. దీని వల్ల ప్రయోజనాలకంటే దుష్పరిణామాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రాణాంతకమైనది. కేవలం ఐదు చుక్కలు తీసుకున్న ప్రాణాలను గాలిలో కలిపేస్తుంది. చికిత్సలో దీనికి విరుగుడు లేక పోవడంతో వంద శాతం మరణాలు సంభవిస్తున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగుతున్న వారిని వైద్యులుగా మేం కాపాడలేక పోతున్నాం. ఈ మందు తాగి మరణిస్తున్న వారిలో రైతులు, విద్యార్థులు, మహిళలు, యువకులు ఎక్కువగా ఉంటున్నారు. ఇది ప్రయోజనాలకంటే హానికరమైనదిగా గుర్తించి వెంటనే నిషేధించాలి. అప్పటి వరకు అమ్మకాలపై నియంత్రణ విధించాలి. ప్రమాదకరమైన ఈ మందును గడ్డి నివారణకు పంటలపై వాడడం వల్ల కూడా అనర్థాలు జరుగుతున్నాయి. పంటల్లో అవశేషాలు ఉంటున్నాయి. వాటి వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతినే ప్రమాదమున్నది. గడ్డిమందు వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలి. ఇటీవల కలెక్టర్ పమేలా సత్పతి సహా వ్యవసాయ అధికారులతో కూడా ఈ మందు ప్రభావంపై చర్చించాం. కొన్ని సూచనలు కూడా చేశాం.
ఇది ఒక నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ మందు. దీనిని పిచికారీ చేసిన నాలుగైదు రోజుల్లో యూనిక్ మోడాఫ్ యాక్షన్ ద్వారా అన్ని రకాల గడ్డి, కలుపు మొక్కలను వేర్లతో సహా నివారిస్తుంది. అయితే ఇప్పుడు గడ్డిపైన కాకుండా జీవితంపై విరక్తి పుట్టి క్షణికావేశానికి లోనవుతున్న వారిని సునాయసంగా మృత్యువు ఒడికి చేరుస్తున్నది. ఈ గడ్డిమందును విచ్చల విడిగా విక్రయిస్తుండడంతో ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వారు ఈ మందును తాగుతున్నారు. అయితే ఈ మందుకు విరుగుడు లేదని, ముందుగా కిడ్నీలపై ప్రభావం చూపుతుందని, ఆ తర్వాత లివర్ పాడవుతుందని, ఊపిరి తిత్తులు కూడా దెబ్బతిని ప్రాణాలు పోతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ మందు తాగిన బతికిన కొద్ది మంది ఏదో ఒక అవయమాన్ని కోల్పోవాల్సి వస్తుందని, అది కూడా ఎక్కువ కాలం జీవించే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మందును నిషేధించాలని డబ్ల్యూహెచ్ఓకి చెందిన ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ పర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ స్పష్టం చేసింది. గడ్డిమందుకు బదులు సేంద్రియ పద్ధతులను ఉపయోగించాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది. పార్లమెంట్లో పలువురు ఎంపీలు కూడా పారాక్వాట్ను నిషేధించాలని డిమాండ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.