Peddapally | పెద్దపల్లి, జూలై 03(నమస్తే తెలంగాణ): క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య బృందాన్ని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. ఇటీవల ఇద్దరు మహిళలకు జిల్లా ఆసుపత్రిలో సక్సెస్ ఫుల్‌గా శస్త్ర చికిత్సలు చేసిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు.
అధికారుల కథనం ప్రకారం.. 31 సంవత్సరాల మహిళ పోతుల స్రవంతి కొంత కాలంగా గ్లాడ్ బ్లాడర్‌లో స్టోన్స్‌తో కడుపు నొప్పి, వాంతులు లాంటి సమస్యలతో బాధ పడుతుండగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రో స్కోపిక్ ద్వారా గ్లాడ్ బ్లాడర్ సర్జరీలు నిర్వహిస్తున్నారని తెలుసుకొని, మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే శ్రీధర్‌ను సంప్రదించింది. వెంటనే స్పందించి అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్, 2డి ఎకో లాంటి పరీక్షలు నిర్వహించి పేషెంట్‌ను అడ్మిట్ చేసుకొని, గురువారం విజయవంతంగా లాప్రో స్కోపిక్ సర్జరీ చేశారు.
అదే విధంగా పెద్దపల్లిలో ఉండే 36 సంవత్సరాల గడ్డం కవిత అనే మహిళ గర్భ సంచిలో గడ్డలతో తీవ్ర రక్త స్రావంతో గత కొంత కాలంగా బాధ పడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. ఆమెకు గతంలో మూడు సర్జరీలు జరగగా.. నాల్గవ సర్జరీ చాలా క్లిష్టమైనప్పటికీ ఆమెకు సైతం సక్సెస్ ఫుల్‌గా సర్జరీ చేశారు. ఈ శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు అనసూయ, స్వాతి, శ్రీధర్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి కార్పొరేట్ సర్జరీలు చేయడం వల్ల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఇంకా నవజాత శిశు కేంద్రంతో పాటుగా సీపాప్ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయని, ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.