సిరిసిల్ల తెలంగాణ చౌక్, జనవరి18: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఉండే విద్యార్థులపై కేర్ తీసుకోవాలని అధికారులను సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా చూడాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గీతానగర్లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజరి గౌతమితో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూం, స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు.
వసతి గృహ అధికారి కల్యాణి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో సస్పెండ్ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దుప్పట్లు, యూనిఫాంలు పంపిణీ చేశారా..? మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. హాస్టల్కు పేయింట్ వేయించాలని స్పెషల్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్ రఫీని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఇన్చార్జి మైనార్టీ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, స్పెషల్ అధికారి సర్వర్ మియా తదితరులు ఉన్నారు.