రాజన్న సిరిసిల్ల, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాలనలో మార్క్ చూపారు. తన రెండేళ్ల పది నెలల పాలనలోనే జిల్లాను అన్నిరంగాల్లో తీర్చిదిద్దారు. సిరిసిల్ల వేదికగా అనేక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల ప్రశంసలు పొందారు. విద్య, వైద్య రంగాలు బలోపేతమైతేనే పేదల జీవితాలు బాగుపడతాయని భావించి అనేక సంస్కరణలు చేపట్టి సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అపోహను పోగొట్టి ఆదరించేలా చేశారు. సర్కారు బడులను బలోపేతం చేశారు. పిల్లలకు ఆధునిక ఐటీ, ఐటీ ఆధారిత విద్యా బోధన అందించేందుకు చర్యలు తీసుకున్నారు. 60 ప్రభుత్వ పాఠశాలల్లో 12,800 మందికి కంప్యూటర్ చాంప్స్ పేరుతో డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలను పూర్తిగా ప్రక్షాళన చేశారు.
రోగులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, తనిఖీలు చేసి వైద్య సేవల్లో పురోగతికి కృషి చేశారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. ఆరు పీహెచ్సీలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్ రావడం ఆయన పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచి ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్టవేయాలని ‘మిషన్ 80’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టి విజయవంతమయ్యారు. ప్రభుత్వ దవాఖానలపై గర్భిణులకు నమ్మకం కల్పించి 50 శాతం ఉన్న ప్రసవాల సంఖ్య 80కి పెంచేలా చేశారు. గర్భిణుల కోసం ప్రత్యేకంగా జిల్లా దవాఖానలో ‘మాతృసేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా జిల్లాలోని తొమ్మిది పీహెచ్సీల్లో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభించి, పేదలకు బాసటగా నిలిచారు.
ఇటు జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దేందుకు ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ కార్యక్రమాన్ని అమలు చేశారు. కాల్షియం, ఐరన్ , పీచు పదార్థం ఎకువ ఉండే రాగి లడ్డూను ప్రతి శనివారం అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు అందించారు. ఈ ప్రయోగంతో పోషకాహారలోప నివారణకు చెక్పెట్టడంతోపాటు స్థానిక రైతులను చిరుధాన్యాల సాగువైపు మళ్లించారు. జీవిత చరమాంకంలో వృద్ధులకు ఆహ్లాదాన్ని అందించి ఆయుష్షును పెంచేందుకు మానవీయ కోణంలో రాష్ట్రంలోనే తొలి డే కేర్ సెంటర్ను ఎల్లారెడ్డిపేటలో ప్రారంభించారు. మండేపల్లిలో ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు.
జిల్లాలో ఆరు ఎస్సీ హాస్టళ్ల ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉండేలా ప్రత్యేక చొరవ చూపారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు సిరిసిల్ల అర్బన్ పార్, వేములవాడ మూలవాగు బండ్ పార్, సిరిసిల్ల కొత్త చెరువును అందంగా తీర్చిదిద్దారు. ఇంకా ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అర్హులందరికీ అమలయ్యేలా చూసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా అన్నింటా తనదైన ముద్రవేసుకున్న అనురాగ్ జయంతి ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు బదిలీ అయ్యారు.