canal bridges | జూలపల్లి, ఆగస్ట్ 18 : పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలంలో కెనాల్ వంతెనలు దెబ్బతింటున్నాయి. కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వంతెనలు బాగు చేయించాలని పలుమార్లు విన్నించుకున్నామని, అయినా పట్టించుకోవటం లేదంటూ రైతులు ప్రయాణికులు వాపోతున్నారు. ఎస్సారెస్పీ డీ-83 ప్రధాన కాలువపై మూడు చోట్ల వంతెనలు పగుళ్లు పడి ఇనుప రాళ్ళు తేలి కూలిపోతున్నాయి. దాదాపు 50 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం వంతెనలు నిర్మించింది.
కెనాల్ వంతెనలకు మరమ్మతులు లేక కాలక్రమేనా పూర్తిగా దెబ్బతిన్నాయి. కుమ్మరి కుంట వద్ద గత ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో భారీ వర్షాలకు కెనాల్ పై ఉన్న వంతెన కుప్ప కూలింది. దాదాపు రెండు నెలల క్రితం కాచాపూర్ -తుర్కలమద్దికుంట (పెద్దపల్లి మండలం) గ్రామాల మధ్య ఎస్సారెస్పీ కెనాల్ పై వంతెన పై పెద్దపెద్ద గోతులు పడి ఊగుతోందని ప్రయాణికులు తెలిపారు. వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తూ భయాందోళనకు గురవుతున్నారు. అబ్బాపూర్ లో తెనాలి వంతెన పగులు పడి ప్రమాదంలో ఉన్నది. ప్రజా ప్రతినిధులు, అధికారులు వంతెనలు బాగు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.