ఇల్లంతకుంట రూరల్, ఏప్రిల్ 9: ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట గ్రామంలోని మోడల్ స్కూల్ హాస్టల్లోకి గురువారం రాత్రి నాగుపాము వచ్చింది. 8గంటల ప్రాంతంలో విద్యార్థినుల గదిలోకి రావడంతో బాలికలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కేకలు వేయడంతో హాస్టల్ వార్డెన్, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. తర్వాత అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బత్తిని స్వామికి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులతో కలిసి వచ్చాడు.
నాగుపామును చంపడంతో విద్యార్థినులంతా ఊపిరి పీల్చుకున్నారు. హాస్టల్ చుట్టూ వ్యవసాయ పొలాలు, వెనకాల అరటి చెట్లపొదలు, చెత్తాచెదారంతో ఉండడంతోనే పాము వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్ ఆవరణలో పుట్టలు, హాస్టల్ వెనకాల అరటి చెట్లను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.