ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల స్వాహా స్కాం బట్టబయలైంది. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా, అందులో ఒకరు కాంగ్రెస్ నాయకుడు కావడం సంచలనం రేపుతున్నది. మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ అక్రమాలపై ‘సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్వాహా’ శీర్షికన ఈనెల 15న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ సంచికలో కథనం ప్రచురించింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఒక ముఠాగా ఏర్పడి.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల డబ్బులను ఎలా స్వాహా చేస్తున్నారనే విషయాలను కండ్లకు కట్టినట్టు వివరించింది. ఒకరి చెక్కులను మరొకరి ఖాతాలో వేసుకుంటూ.. వాటిని సొమ్ము చేసుకుంటూ.. స్వాహా చేస్తున్న తీరును ఎండగట్టింది.
కరీంనగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన కే రవి గతంలో తన తండ్రికి ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించాడు. అందుకు అయిన ఖర్చులను ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. నెల క్రితం అతని పేరిట 60వేల చెక్కువచ్చింది. ఆ మేరకు ఈ విషయాన్ని తెలుసుకున్న కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఆ చెక్కును తీసుకెళ్లి.. అదే మండలం రహీంఖాన్‌పేటకు చెందిన కే రవి అనే పేరున్న వ్యక్తి ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత డ్రాచేసిన 60వేలను పంచుకున్నారు. ఈ తతంగాన్ని ఈనెల 15న ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ కథనం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. అయితే దీనిని కప్పిపుచ్చేందుకు కొన్ని శక్తులు శతవిధాలుగా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. కానీ, ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ బహిర్గతం చేయడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు అరెస్టు చేయక తప్పలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు రిమాండ్
రెండు నెలల క్రితం ఇల్లంతకుంట మండలానికి చెందిన 40 సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఇల్లంతకుంటకు చెందిన వినయ్ ద్వారా ఈ చెక్కులను పంపగా, రహీంఖాన్‌పేట్‌కు చెందిన అంతగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి కే రవి అనే లబ్ధిదారుడి పేరు మీదున్న చెక్కుతోపాటు సంబంధం లేని మరో 60వేల విలువ చెక్కును తీసుకెళ్లాడు. వినయ్ నుంచి ఆ చెక్కును తీసుకెళ్లిన శ్రీనివాస్, రహీంఖాన్పేటకే చెందిన మరో వ్యక్తి కే రవికి కొన్ని డబ్బులు ఇస్తామని ఆశ చూపాడు. ఆయన అకౌంట్లో చెక్కు వేసి డబ్బులు డ్రాచేశాడు. వచ్చిన మొత్తం నుంచి కే రవి 20వేలు తీసుకోగా.. మిగిలిన 40వేలను శ్రీనివాస్ తీసుకున్నాడు. ఈ వివరాలను ఇల్లంతకుంట మండల పోలీసులు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పీఏ డోలి సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సోమవారం అంతగిరి శ్రీనివాసుతో పాటు కే రవిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఆ ఇద్దరు నేరం ఒప్పుకున్నారని, ఆ మేరకు రవి నుంచి 20వేలు, శ్రీనివాస్ నుంచి 40వేలు స్వాధీనం చేసుకొని రిమాండ్ చేశామని ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. అందులో అంతగిరి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకుడు కావడం గమనార్హం.
తీగలాగితే కదలనున్న డొంక
నిజానికి ఇది ఒక్కరి ఇద్దరి సమస్య మాత్రమే కాదు, లోతుగా వెళ్తే ఈ స్కాం భారీగానే జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 20లక్షల నుంచి 30లక్షల వరకు ఈ తరహాలోనే సీఎంఆర్ఎఫ్ చెక్కుల సొమ్మును స్వాహా చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకోసం కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఒక ముఠాగా ఏర్పడి ఈస్కాంకు పాల్పడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ తరహా వ్యవహారం కేవలం ఇల్లంతకుంట మండలంలోనే కాదు, చాలా చోట్ల జరిగినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ స్కాంపై లోతుగా విచారణ జరపాలన్న డిమాండ్ వస్తున్నది. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు నియోజకవర్గం మొత్తం మీద ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులెన్ని? సదరు బాధిత వ్యక్తులకు అవి అందాయా.. లేదా? అనే వివరాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు దరఖాస్తుదారుడికి ఇంటికి వెళ్లి విచారణ చేస్తే.. మొత్తం బండారం బయటపడే అవకాశముంటుంది. నిజానికి ఈ తరహా అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయనే విమర్శలు వస్తుండగా.. తమకు మాత్రం ఒకే ఫిర్యాదు అందిందని, ఆమేరకు విచారణ చేసి ఇద్దరిని రిమాండ్‌కు పంపించామని ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ ‘నమస్తే’కు తెలిపారు. అయితే దీనిపై లోతైన విచారణ జరిపి తీరాల్సిందేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తాజాగా డిమాండ్ చేశారు.