పెద్దపల్లి, జూన్ 24(నమస్తే తెలంగాణ): రామగుండం నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎంను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. రామగుండంలో ఇప్పటికే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయగా, నర్సింగ్ కళాశాల కూడా మంజూరు చేయాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సింగరేణి సీఅండ్ఎండీకీ ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా, దశాబ్ధాల కాలంగా నియోజకవర్గంలోని అంతర్గాం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న కురూజ్కమ్మీ భూములు 1018 ఎకరాలకు సంబంధించిన పట్టాల సమస్య తెలుపగా, ప్రభుత్వ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌కు ఫోన్ చేసి పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలైన పొట్యాల, ముర్మూర్, ఎల్లంపల్లి, కుక్కలగూడూర్, వేంనూర్, మద్దిరాల, ఉండెడ గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని కోరగా, వెంటనే సీఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా సుందిళ్ల(పార్వతీ) బ్యారేజీకి ఎగువన ఎల్లంపల్లి వరకు కరకట్ట నిర్మించాలని విజ్ఞప్తి చేయగా, గత వరదల సమయంలో జరిగిన ముంపును దృష్టిలో ఉంచుకొని ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం ఎమ్మెల్యేకు తెలిపారు. కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా, వెంటనే పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు.
ఇటీవల రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రామగుండం నియోజకవర్గానికి ప్రకటించిన రూ.100 కోట్ల స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్‌ను మంజూరు చేయాలని కోరగా వెంటనే మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారని ఎమ్మెల్యే వివరించారు. గోదావరి నదిపై లింగాపూర్ వద్ద లిఫ్టు మంజూరు చేయాలని కోరగా, మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 76 జీవోకు సంబంధించి భూములను స్వాధీనం చేసుకుని పట్టాల పంపిణీ వెంటనే చేపట్టాలని కోరగా సానుకూలంగా స్పందించారు. రామగుండం నియోజకవర్గ సమస్యలను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. కాగా, నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.