కరీం‘నగరం’లో మంచినీటి సరఫరా అధ్వానంగా మారింది. నగర పాలక అధికారుల పట్టింపులేమితో శుద్ధి ప్రక్రియ అటకెక్కింది. ఏండ్లు గడుస్తున్నా ఫిల్టర్ బెడ్స్‌లో ఇసుక, గులకరాళ్లు మార్చకపోవడం, క్లోరినేషన్ అంతంత మాత్రంగానే చేస్తుండడంతో నగరవాసులకు రంగుమారిన నీరే దిక్కవుతున్నది. ఎల్ఎండీ జలాశయం నుంచి డ్రా చేస్తున్న రా వాటర్ వచ్చింది వచ్చినట్టే చేరుతుండగా, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం వానకాలం నేపథ్యంలో రిజర్వాయర్‌లోకి కొత్త నీరు రానుండగా, అప్రమత్తంగా ఉండి, వడపోత సరిగా చేయకపోతే ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికైనా యంత్రాంగం మేలుకోవాల్సి ఉన్నది.
కరీంనగర్ కార్పొరేషన్, జూలై 1 : నగరంలో మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ కింద 39 ఎంఎల్డీ కెపాసిటీతో ఫిల్టర్ బెడ్ ఉండగా, నగరపాలక ఆధ్వర్యంలో 34, 14 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్స్ పనిచేస్తున్నాయి. భగీరథ నీటికి సంబంధించి క్లోరినేషన్, అలాం (పటిక) విషయంలో ఎలాంటి కొరత, ఇబ్బందులు లేకపోగా, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫిల్టర్ బెడ్స్ల్లో మాత్రం కొరత వేధిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా 14 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ గడువు ఎప్పుడో తీరిపోయినా కొనసాగిస్తున్నారని, ఏండ్లు గడుస్తున్నా ఇసుక, గులకరాళ్లను మార్చడంలేదని, క్లోరినేషన్ విషయంలో నిర్లక్ష్యం జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
అందులో పనుల కోసం 40 లక్షలు మంజూరైనా టెండర్ నిర్వహణలో ఆలస్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఫలితంగా ఈ ఫిల్టర్ బెడ్లో నీరు సరిగ్గా శుద్ధి జరుగకుండానే సరఫరా జరుగుతున్నదని అధికారులే అంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్‌కు సంబంధించి క్లోరినేషన్ సెంటర్లో అడ్వాన్స్‌గా క్లోరినేషన్ సిలిండర్స్ పెడుతుండగా, బల్దియాలోని ఫిల్టర్ బెడ్లలో ఒక సిలిండర్ అయిపోతే మరో సిలిండర్ వచ్చేదాకా రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. బల్దియా నుంచి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లింపులు సరిగ్గా లేకపోవడంతో సిలిండర్ల పంపిణీ అలసత్వం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ గ్యాప్‌లో క్లోరినేషన్ లేకుండానే అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీరు రంగు మారి వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం వానకాలం నేపథ్యంలో నీటి శుద్ధి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎల్ఎండీలోకి కొత్త నీరు వస్తుంటుంది. వర్షాలు జోరుందుకోకపోవడంతో ప్రస్తుతం వరద రానప్పటికీ, మున్ముందు పోటెత్తే అవకాశాలుండగా, ఇలాంటి టైంలో శుద్ధి జరుగకపోతే నగర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాగా, నీటి శుద్ధి అంతంతమాత్రంగానే జరుగుతున్నట్టు తెలుస్తుండడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. పకడ్బందీగా ఫిల్టర్ చేయాలని కోరుతున్నారు.
నగరంలో సరఫరా చేసే నీటిని పకడ్బందీగా ఫిల్టర్, క్లోరినేషన్ చేస్తున్నాం. నీటిని పరీక్షించిన తర్వాతే ఇంటింటికీ అందిస్తున్నాం. 14 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్లో ఇసుక, ఇతర నిర్వహణ కోసం టెండర్ ప్రక్రియ చేపట్టాం. బిల్లులు చెల్లించే విషయంలో ఇబ్బందులు ఉన్నా క్లోరిన్ సిలిండర్ల సరఫరాలో సమస్యలు లేకుండా చూస్తున్నాం.
– లచ్చిరెడ్డి, డీఈ