సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 2: కక్షసాధింపు చర్యల్లో భాగంగా సీజ్ చేసిన చిత్రబార్ ఎట్టకేలకు తెరుచుకున్నది. హైకోర్టు ఆదేశాలతో బార్ సీల్‌ను బుధవారం తొలగించడంతో హర్షం వ్యక్తమైంది. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి సంబంధించిన సిరిసిల్లలోని చిత్ర బార్‌ను అధికారులు జనవరి 29న ట్రేడ్ లైసెన్సు సాకుతో సీజ్ చేశారు. తాము ఎటువంటి నిబందనలు ఉల్లంఘించలేదంటూ సీజ్ సమయంలో చక్రపాణి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31వరకు ట్రేడ్ లైసెన్సు ఫీజ్ చెల్లించేందుకు గడువు ఉన్నప్పటికీ కక్షసాధింపుతోనే తమ బార్‌ను సీజ్ చేశారని వాపోయారు.
ఫీజు ఎంతో చెబితే వెంటనే చెల్లిస్తామని కోరిన కమిషనర్ స్పందించలేదు. కొద్దిసేపటికే ఆన్లైన్లో ఫీజు చెల్లించి సీల్ తొలగించాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో నిబందనలకు విరుద్ధంగా తమ బార్‌ను సీజ్ చేశారంటూ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు జనవరి 31న బార్ సీల్ తొలగించాలంటూ ఆదేశాలిచ్చింది. కానీ, అధికారులు మాత్రం బార్ సీల్ తొలగించకుండా రెండు నెలల పాటు కాలయాపన చేశారని బార్ యాజమాన్యం తెలిపింది. మరోసారి బార్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు తీర్పును ధిక్కరించిన కమిషనర్ భౌతికంగా హాజరు కావాలంటూ ఫార్మ్-1 జారీ చేసింది చెప్పింది. కాగా, బుధవారం హైకోర్టులో విచారణ జరగగా బార్ సీల్‌ను వెంటనే తొలగించి, మరుసటి రోజు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. దీంతో కమిషనర్ బుధవారం సాయంత్రం హుటాహుటిన్ బార్ సీల్‌ను తొలగించారు. ఈ విషయంపై కమిషనర్ సమ్మయ్యను వివరణ కోరగా, కోర్టు ఆదేశాలతో బార్ సీల్ తొలగించామంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.
మున్సిపల్ చైర్మన్‌గా తమ పదవీ కాలం ముగిసిన రెండు రోజుల్లోనే మున్సిపల్ అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే ట్రేడ్ లైసెన్సు ఫీజు చెల్లించలేదంటూ బార్‌ను సీజ్ చేసి ఆర్థికంగా, మానసికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేశారని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. తాము న్యాయవ్యవస్థపై నమ్మకంతో హైకోర్టును ఆశ్రయించగా సీల్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. తాము న్యాయం కోసం చేసిన పోరాటంలో సాధించిన గెలుపుతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నమ్మకం మరింత పెరిగిందన్నారు. రెండు నెలల కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.