పెద్దపల్లి, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి, పెద్దపల్లి కమాన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రానికి వచ్చారు. ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన యువ వికాసం సభకు హాజరయ్యారు. సాయంత్రం 4గంటల తర్వాత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి మంత్రులతో కలిసి కలెక్టరేట్ ఎదుట పెద్దకల్వల, రంగంపల్లి శివారులో ఏర్పాటు చేసిన సభా స్థలికి చేరుకున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. 1,035 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
సాయంత్రం 4.30గంటలకు వేదికపైకి చేరుకున్నారు. మంత్రుల ప్రసంగం అనంతరం స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం, డీఈఈటీ, రియల్‌టైం గవర్నెన్స్ మేనేజ్మెంట్ సిస్టం, సీఎం కప్ ఆవిష్కరణలు చేశారు. ఇటీవల గ్రూప్-4, సింగరేణి కొలువులు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి 47 నిమిషాలపాటు ప్రసంగించారు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజినీరింగ్, లా కళాశాల మంజూరుకు ప్రయత్నంచేస్తామని చెప్పారు. మంథనిలో కోకోకోలా ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాత్రి 7.30గంటల తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర్ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ గడ్డం వంశీ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.