కరీంనగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కలను సాకారం చేశారు. గతేడాది నవంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, రామగుండం కాలేజీలను ప్రారంభించారు. తాజాగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 11.05 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి వర్చవల్ విధానంలో ప్రారంభించగా, ఆయాచోట్ల ఫస్టియర్ విద్యార్థులు సంబురంలో మునిగిపోయారు. కరీంనగర్లో వంద సీట్లకు 90 మంది, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంద సీట్లకు 95 మంది అడ్మిషన్లు తీసుకోగా, అందులో 35 మందికిపైగా ఉమ్మడి జిల్లాకు చెందిన వారే ఉన్నారు.
ఫస్టియర్ విద్యార్థులను ‘నమస్తే తెలంగాణ ప్రతినిధులు’ పలుకరించగా, తమ మనోగతాన్ని పంచుకున్నారు. ఎన్నో ఏండ్ల చిరకాల కల నెరవేరిందని, పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలు డాక్టర్లయ్యే అవకాశం వచ్చిందని చెబుతున్నారు. గతంలో మెడిసిన్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చేదని, లక్షల రూపాయలు ఖర్చుపెట్టాల్సి వచ్చేదని, ఇప్పుడు తమ చెంతకే అందుబాటులోకి రావ డం సంతోషంగా ఉన్నదన్నారు. తమ ఇంటి ముందుకే వైద్యకళాశాల వచ్చినట్లు ఉన్నదని ఆనందం వ్యక్తం చేశారు. మెడిసిన్ కలను నెరవేరుస్తున్న సీఎంకు ‘థ్యాంక్స్ టూ కేసీఆర్’అంటూ కృతజ్ఞతలు చెప్పారు.
సంగారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చిన
కౌన్సెలింగ్‌లో నాకు సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కరీంనగర్లో మెడికల్ కళాశాల రావడంతో ఇక్కడే ఎంపిక చేసుకున్నా. అదృష్ట వశాత్తు సీటు వచ్చింది. మాది వరంగల్. ఇక్కడికి దగ్గర ఉంటుందని ఇలా చేశా. గతంలో ఎక్కడ సీటు వస్తే అక్కడికి వెళ్లి చచ్చినట్లు జాయిన్ కావల్సిందే. అంటే అప్పుడు సీట్లు తక్కువగా ఉండేవి. ఇపుడు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో దగ్గరలోనే చదువుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ కొత్త కాలేజ్ ఎట్లుంటదో అన్న భయం ఉండేది. కానీ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ బాగున్నాయి.
– గౌరిశెట్టి రిషిక, కరీంనగర్ మెడికల్ కాలేజీ
ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు
మాది హన్మకొండ. తెలంగాణ రాకముందు ఎంబీబీఎస్ చదవడం అంటే ఎంతో కష్టం. ఎందుకంటే నీట్ పరీక్ష రాసేవారు లక్షల్లో ఉంటే సీట్లు వందల్లోనే ఉండేవి. మంచి ర్యాంకు వచ్చినా సీటు దొరికేది కాదు. విదేశాలకో, ఇతర రాష్ర్టాలకో వెళ్లాల్సి వచ్చేది. కానీ సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సుమారు 10 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో సామాన్యులకు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. ఇందుకు కారణమైన సీఎం సార్‌కు థ్యాంక్స్.
– కే హరిప్రియ, సిరిసిల్ల మెడికల్ కాలేజీ
మా రాష్ట్రంలో ఇన్ని సీట్లు ఉండవు
మాది పశ్చిమబెంగాల్. మా డాడీ బిజినెస్ కోసం హైదరాబాద్‌లో సెటిలయ్యారు. నన్ను డాక్డర్ చేయాలనేది మా మమ్మీడాడీ కొరిక. వారు ఎంకరేజ్ చేయడంతో నీట్ రాశాను. ర్యాంక్ వచ్చింది. నాకు వచ్చిన ర్యాంక్‌కు మా రాష్ట్రంలో మెడిసిన్ సీటు వచ్చే అవకాశం లేదు. అక్కడ ఇన్నీ కాలేజీలు, సీట్లు లేవు. తెలంగాణలోనే సీటు రావాలని కోరుకున్న. అనుకున్నట్లుగానే కరీంనగర్ గౌట్ కాలేజీలో సీటు వచ్చింది. కేసీఆర్ సార్ డిస్టిక్కో కాలేజీ ఏర్పాటు చేయడంతోనే నాకు డాక్టరయ్యే అవకాశం వచ్చింది.
– పరిధి లహరి, కరీంనగర్ మెడికల్ కాలేజీ
ఈజీగా సీటొచ్చింది
ఈ సారి నేషనల్ లెవల్లో నీట్ రాసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది. కానీ తెలంగాణలో అన్ని స్టేట్లలో కంటే ఎక్కువ సీట్లున్నాయి. ఇక్కడి స్టూడెంట్స్‌కే ఎక్కువ ఆడ్మిషన్లు ఇస్తున్నారు. అందుకే ఈజీగా అడ్మిషన్ వచ్చింది. అందుకు కారణమైన కేసీఆర్ సార్‌కు థ్యాంక్స్ చెప్పాలి. నా లాంటి మిడిల్‌క్లాస్ స్టూడెంట్స్‌కు డాక్టరయ్యే అవకాశం వచ్చేదికాదు. కేసీఆర్ సార్‌తోనే కరీంనగర్లో ఇంటి వద్ద నుంచి వెళ్లి మెడిసిన్ చదువుకునే అవకాశం వచ్చింది. కరీంనగర్ కాలేజీలో ఫెసిలిటీస్ మంచిగున్నాయి. మా ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలనే మా నాన్న కల నెరవేరుతుంది.
– తునికి వర్షిణి, కరీంనగర్ మెడికల్ కాలేజీ
ఫస్ట్ టైం సీటు రాలేదు ..
మాది జమ్మికుంట. నీట్ పరీక్షకు హాజరు కావడం ఇది రెండోసారి, ఫస్ట్ టైం రాసినప్పుడు ర్యాంకు వచ్చినా సీటు రాలేదు. రెండో సారి ఈజీగా ఆడ్మిషన్ వచ్చింది. ఇందుకు కారణం కేసీఆర్ సార్ డిస్ట్రిక్‌కు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే. మా మమ్మీ, డాడీ గవర్నమెంట్ జాబర్స్.ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలని వారు అనుకొనేది. ఫస్ట్‌టైం సీటు రాలేదు. పట్టుదలతో మళ్లీ పరీక్ష రాశా. ఈ సారి సీట్లు పెరగడంతో సీటు వచ్చింది. మా మమ్మీడాడీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో తప్పా దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని సీట్లు లేవు. గతంలో మెడిసిన్ అంటే మా లాంటి వాళ్లు అది మనం చదివే చదువు కాదు అనుకునే వాళ్లు. కాని ఇపుడు నాలాంటి ఎందరికో డాక్టరయ్యే అవకాశం వచ్చింది..
– మంథని సాయి ప్రణవి, కరీంనగర్ మెడికల్ కాలేజీ
మా డాడీ కలను కేసీఆర్ సార్ నేరవేర్చారు..
మా డాడీ సాఫ్ట్వేర్ ఇంజినీర్. నన్ను డాక్టర్ చేయాలనేది ఆయన కల. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నరు. నీట్ రాసే ముందు దేశంలో ఎక్కడ సీటు వచ్చినా వెళ్లమని చెప్పారు. ప్రభుత్వం కరీంనగర్లో ఈ సంవత్సరమే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తుందని, నాకు ఇక్కడే సీటు వస్తుందని ఆయన అనుకోలేదు. ఇక్కడ సీటు వచ్చిన విషయం చెప్పగానే సంతోష పడ్డారు. కేసీఆర్ సర్ వల్లనే సీటు వచ్చిందని చెప్పిన. చక్కగా చదువుకుని మా నాన్నకు, ఈ అవకా శం ఇచ్చిన కేసీఆర్ సర్‌కు మంచి పేరు తెస్తా.
– సయ్యద్ మెహతాజ్ ముజీబ్, కరీంనగర్ మెడికల్ కాలేజీ
మా జిల్లాలోనే ఎంబీబీఎస్ చదువు
మాది సిరిసిల్ల. మా నాన్న బాలకిషన్ ప్రైవేట్ ల్యాబ్ టెక్నిషీయన్. అమ్మ స్వప్న పట్టణంలోనే ప్రైవేట్ టీచర్. మా అమ్మనాన్నలకు ఇద్దరం కూతుళ్లం. మా అక్క హైదరాబాద్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కాలేజీలో సెకండి యర్ చదువుతున్నది. నేను ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన. సిరిసిల్ల మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. గతంలో ఇంటర్ పూర్తికాగానే దూరప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. కానీ డాక్టర్ చదువును సిరిసిల్లలోనే పూర్తి చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్న. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్ ఉన్ననాయకులు. వారి చొరవతోనే పేదింటి బిడ్డలకు పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశం వచ్చింది.
– వేముల శ్రీజ, సిరిసిల్ల మెడికల్ కాలేజీ
ఎంతో హ్యాపీగా ఉన్నది..
మాది కరీంనగర్. డాక్టర్ కావాలనేది నా చిన్ననాటి కోరిక. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాలనే పట్టుదలతో ముందు నుంచే ప్రిపేరైన. కానీ సీటు ఎక్కడ వస్తుందో, ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోననే ఆందోళన ఉండేది. నా అదృష్టం కొద్ది కరీంనగర్ మెడికల్ కాలేజీలోని సీటు వచ్చింది. ఇంటి వద్దనే ఉంటూ డాక్టర్ అయ్యే అవకాశం రావడం హ్యాపీగా ఉన్నది. నా కల నెరవేర్చిన సీఎం కేసీఆర్, మంత్రి గంగుల సార్లకు థ్యాంక్స్..
– విమ్మడి దీక్షిత, కరీంనగర్ మెడికల్ కాలేజీ
నాకు కాలేజీ నచ్చింది
మాది హైదరాబాద్. మా నాన్న ఇటీవలే చనిపోయారు. అమ్మ ట్యూషన్ చెప్పి నన్ను, తమ్ముడిని చదివిస్తున్నది. నాకు కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చిందని తెలియగానే కొంత టెన్షన్‌గా ఫీలయ్యా. కొత్తగా కాలేజీ ఎట్లుంటదో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సంతోషించిన, సౌకర్యాలు బాగున్నాయి. మంచి ఫ్యాకల్టీ ఉన్నది. మెడిసిన్ చదివితే ఇక్కడే చదవాలని అనుకున్న. సీఎం సార్ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. దీంతో ఆటోమెటిక్‌గ్గా సీట్లు పెరుగుతయి. మెడిసిన్ అంటే ఇష్ట పడేవారు చాలా మంది ఉంటరు. కానీ సీట్లు కొన్నే ఉంటాయని టైం వేస్ట్ చేసుకోవద్దని ఇటువైపు రాలేదు. ఇపుడు సీట్లు పెరగడంతో నీట్‌కు హాజరయ్యే వారి సంఖ్య పెరుగుతుంది.
– బొందిలి భరణి, కరీంనగర్ మెడికల్ కాలేజీ
లక్కీగా కరీంనగర్‌లోని సీటోచ్చింది
మాది ఆదిలాబాద్. మెడిసిన్ చేయాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాన్నే. అదే పట్టుదలతో నీట్ రాశాను. ర్యాంక్ వచ్చింది. ఎక్కడ సీటు వస్తుందో ఏమోనని కొంత టెన్షన్ పడ్డ.. లక్కీగా కరీంనగర్ మెడికల్ కాలేజీలోనే సీటు వచ్చింది. ఈ విషయం చెప్పగానే మా ఇంట్లో వాళ్లు కూడా ఎంతో సంతోషించారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయకుంటే నాకు ఇంత దగ్గర సీటు వచ్చేది కాదు. ఇందుకు కేసీఆర్ సరే కారణమని వారికి వివరించిన. మెడిసిన్ పూర్తికాగానే జిల్లా ప్రజలకు సేవలందిస్తా..
– మహ్మద్ ఓవైస్, కరీంనగర్ మెడికల్ కాలేజీ