MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల నవంబర్ 24: చెస్ క్రీడ నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెస్ నెట్ వర్క్ స్పాన్సర్ చేసిన చెస్ బోర్డులను విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదడుకు పదును పెట్టేందుకు చదరంగం క్రీడ ఎంతో దోహదపడుతుందన్నారు. వ్యాయామంతో శారీరక దృఢత్వం పెంపొందుతుందని, చెస్ క్రీడ తో మేధో శక్తి పెరుగుతుందన్నారు.
ఆధునిక యుగంలో యువత సెల్ఫోన్లకు బానిసలుగా మారారని, చదరంగం క్రీడ అభ్యాసంతో మానసిక దృఢత్వం, ఏకాగ్రత, స్వీయ నియంత్రణ అలవడుతుందన్నారు. విద్యార్థులు అవసరమైతే తప్ప సెల్ఫోన్లను వినియోగించవద్దని చెస్ వైపు అడుగులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాలు, దురలవాట్లకు దూరం చేసేందుకు చదరంగం క్రీడను విద్యార్థి లోకానికి మరింత దగ్గర చేసేందుకు చెస్ నెట్వర్క్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కోరుట్ల పరిసర గ్రామాల్లో నీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 4700 మంది విద్యార్థులకు చెస్ క్రీడపై మక్కువ పెంచేందుకు 250 చెస్ బోర్డులను అందిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేటీఆర్ తో కలిసి తాను అమెరికా వెళ్లిన సమయంలో చెస్ నెట్వర్క్ సంస్థ వ్యవస్థాపకులు సుధీర్ కోదేటిని కలిసిట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కోరుట్ల నియోజవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చెస్ నెట్ వర్క్ ద్వారా సహాకారం అందించాలని కోరినట్లు తెలిపారు. దీంతో కోరుట్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంస్థ 250 చెస్ బోర్డులను అందించినట్లు తెలిపారు. విద్యార్థులు చెస్ నేర్చుకొని ఇతర విద్యార్థులకు సహాకారం అందించి మెదడును చురుకుదనంతో ఉండేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
విద్యార్థులకు చెస్ క్రీడలో మెరుగ్గా రాణించేందుకు పీఈటీలు శిక్షణ అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చదరంగం క్రీడలో కోరుట్ల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభతో రాణిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా చదరంగం బోర్డులను అందజేసిన చెస్ నెట్వర్క్ ప్రతినిధులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేషం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్,నెట్వర్క్ ప్రతినిధి జయవీరు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, ఉపాధ్యక్షుడు అతిక్, ప్రభుత్వ పాఠశాలల పిఈటిలు, పీడీలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.