Karimnagar | కమాన్ చౌరస్తా, జనవరి 19 : కార్టూన్ ద్వారా మార్పు సాధ్యమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఎస్ఆర్ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆటానమస్), కరీంనగర్ లో తెలుగు విభాగం, తెలంగాణ కార్టూనిస్టు వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్టూనిస్టుల చిత్రాల ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ వేగవంతమైన ఈ సమాజంలో తక్కువ సమయంలోనే ప్రజలపై లోతైన ప్రభావం చూపగల శక్తివంతమైన మాధ్యమం కార్టూన్ అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న రుగ్మతలను ప్రశ్నించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి వ్యంగ్య చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయి అని అన్నారు. కార్టూనిస్టుల ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు వారి చిత్రాల ప్రదర్శన కోసం శాశ్వత వేదికను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ పరిసరాలను సూక్ష్మంగా గమనించి, వాటిని తనదైన దృష్టితో వ్యంగ్యంగా వ్యక్తపరిస్తే హాస్యం పుడుతుంది. అదే భావానికి చిత్రరూపం ఇస్తే అది కార్టూన్ అవుతుంన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఇటువంటి శిక్షణ శిబిరాలు ఎంతో అవసరమని, తెలుగు విభాగం ద్వారా కార్టూన్ కళకు ప్రోత్సాహం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ కార్టూనిస్టు వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి రాజమౌళి మాట్లాడుతూ ప్రతీ వ్యక్తిలో కొంత వ్యంగ్యం దాగి ఉంటుందని, దానిని గుర్తించి సరైన రీతిలో వ్యక్తపరిస్తే హాస్యం సృష్టించవచ్చని అన్నారు. తాను కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థినేనని, మళ్లీ సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలిగిందని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ కార్టూనిస్టు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తిలో అంతర్గతంగా హాస్య చతురత ఉంటుందని, దానికి కొంత శాస్త్రీయ దృష్టి, సమాజ అవగాహన జత చేస్తే అది ఒక ఉత్తమ కార్టూన్‌గా మారుతుందన్నారు.
కార్టూన్ రంగంలోకి కొత్తతరం రావాల్సిన అవసరం ఉందని, అందుకుగాను విద్యార్థులను ఆశ్రయంగా తీసుకొని మరో తరానికి కార్టూనిస్టులను అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కళాశాల తెలుగు విభాగాధ్యక్షుడు డాక్టర్ బూర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ వ్యంగ్యం అనేది కరీంనగర్ జిల్లాలో శాతవాహనుల కాలం నుంచే సాహిత్యం, సంస్కృతిలో భాగంగా కొనసాగుతోందని తెలిపారు. తెలుగు సాహిత్యం–కార్టూన్ కళ మధ్య ఉన్న సంబంధాన్ని విద్యార్థులు అవగాహన చేసుకోవాలని సూచించారు. కార్టూనిస్టు భూపతి మాట్లాడుతూ ఒక కార్టూన్ ద్వారా ఎన్నో విషయాలను ఒకే చిత్రంలో చెప్పవచ్చని అన్నారు. సమాజంలోని చెడును వ్యంగ్యంగా చిత్రీకరిస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళ శిక్షణ కార్యక్రమానికి ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఆసక్తిగల విద్యార్థులు తెలుగు విభాగంలో సంప్రదించాలని సూచించారు. కార్టూన్ డ్రాయింగ్ మౌలికాంశాలు, భావవ్యక్తీకరణ, సమాజ అంశాలపై కార్టూన్ రూపకల్పన వంటి అంశాలపై డెమో సెషన్లు, చిత్ర విశ్లేషణలతో ప్రత్యక్ష శిక్షణను రెండు రోజులపాటు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ ఆచార్యులు బూర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ శ్రీనివాస్, మెట్టు వెంకటేశ్వర్లు, మాలతీ దేవి, అశోక్ చైతన్య శంకర్ భోజన్న తదితరులు పాల్గొన్నారు.