కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అసహనానికి లోనవుతున్నారని, అందుకే ప్రజలను పక్కదారి పట్టించే కుట్రలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు విమర్శించారు. అధికారంలో ఉన్న మీరు ప్రొటోకాల్ పాటించకపోగా వ్యక్తిగతంగా దాడులకు దిగుతుండడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హితవు పలికారు. దౌర్జన్యాలకు దిగితే ఇక సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటే ప్రజలు స్వాగతిస్తారని, అధికారం ఉందని విర్రవీగితే తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంత్ చిత్రపటం పెడతామని కాంగ్రెస్ నాయకులు సోమవారం దిగిన నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీ చేయగా, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి గాయపడ్డారు. మంగళవారం ఆయనను సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో లక్ష్మీనరసింహారావు పరామర్శించి మాట్లాడారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకారం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఫొటో పెట్టాల్సింది పోయి, కాంగ్రెస్ నాయకులు దీనిని వ్యక్తిగతంగా తీసుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫొటో పేట్టాలంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల నివాస గృహాల్లో ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలని ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎక్కడా సర్క్యులర్ లేదా ఆదేశాలు లేవన్నారు.
విషయం తెలుసుకోకుండా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాసంలో సీఎం ఫొటో పెట్టాలంటూ గిచ్చి కయ్యం పెట్టారని మండిపడ్డారు. వారిని కట్టడి చేసి తగిన బుద్ధిచెప్పాల్సిన పోలీసులు.. బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనకపోవడంతో కల్లాల్లోనే వడ్లు మొలకెత్తుతున్నాయని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా సీఎం ఫొటో పెట్టాలని రచ్చ చేసి పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ఇకనైనా ఇటువంటి తప్పుడు పద్ధతులు మానుకోవాలని, లేదంటే ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకుల సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని హితవు పలికారు. అర్థం లేని కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో కాంగ్రెస్ నాయకులు చులకనవుతారని సూచించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. నిధులు తెచ్చి సమస్యలు పరిష్కరిస్తే స్వాగతిస్తామని అంతే తప్ప ప్రొటోకాల్ ఉల్లంఘన, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే సహించే ప్రశ్నేలేదన్నారు.