చిగురుమామిడి, జూలై 12 : సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకట్రాజం ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా ఇందుర్తిలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌గౌడ్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి బలమైన కేంద్రం ఇందుర్తి గ్రామమని, గ్రామంలో బలహీన వర్గాల కుటుంబంలో జన్మించిన వెంకట్రాజం మొదటి నుంచి సీపీఐలో పనిచేశాడన్నారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అందరి మన్ననలు పొందారని అన్నారు. ఇందుర్తి గ్రామంలో ముస్కు రాజిరెడ్డి, కూన ముత్యాలు, గునుకుల జనార్దన్ లాంటి నాయకులు పార్టీ కోసం ఎంతో త్యాగం చేశారని, వారి త్యాగాల స్పూర్తితో వెంకట్రాజం కుటుంబ పోషణకు వ్యాపారం చేసుకుంటూ సీపీఐ బలోపేతం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేశారని పేర్కొన్నారు. ఇందుర్తి గ్రామంలో ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీగా ప్రజలకు సేవలందించాడని కొనియాడారు. వెంకట్రాజం లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం సీపీఐ కి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
వారి వెంట జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జడ్పీటీసీ అందె స్వామి, గూడెం లక్ష్మీ, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, తేరాల సత్యనారాయణ, బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు ఎండీ ఉస్మాన్ పాషా, ఇల్లందుల రాజయ్య, మంద ఎల్లయ్య, ఎలగందుల రాజయ్య, నీల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.