చిగురుమామిడి, ఏప్రిల్ 16: మండలంలోని రేకొండ గ్రామంలో అతి పురాతనమైన స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సిపిఐ జాతీయ నేత, ఆలయ గౌరవ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ సభ్యులు బుధవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాచీన ఆలయం అభివృద్ధికి నోచుకాకుండా పోతుందని, గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయని, ప్రతి ఏటా ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని చాడ మంత్రికి వివరించారు.
ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యానికి మౌలిక వసతులతో పాటు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. వీరి వెంట ఆలయ అధ్యక్షులు దుడ్డేల లక్ష్మీనారాయణ, కార్యదర్శి కాసాని సతీష్, కోశాధికారి అరిగెల రమేష్, ఆలయ పాలకవర్గ సభ్యులు కొలిపాక వేణు అన్న సదానందం, తంగళ్ళపల్లి అంజయ్య, గాదెపాక రవీందర్, బిల్ల తిరుపతిరెడ్డి ఉన్నారు.