కమాన్‌చౌరస్తా, మార్చి 22: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాల్లో, కాలనీల్లో పంచాంగం పఠించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఆలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చనలు, అభిషేకాలు, సహస్రనామార్చన, హోమాల వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. 14వ డివిజన్లో కార్పొరేటర్ దిండిగాల మహేశ్-అనిత దంపతుల ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళనంగా ఆయన నివాసంలో ఉగాది వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖైరుద్దీన్, సీఎస్ఐ చర్చి బాధ్యులు కే ప్రశాంత్, ఏ కిరణ్ కుమార్, ఎండీ మజీద్ అలీ, డివిజన్ పెద్దలు పాల్గొన్నారు. అలాగే, హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో, ఆర్టీసీ బస్టాండ్‌లో ఉగాది పచ్చడి, బూరెలు, పండ్లు పంపీణీ చేశారు. ఇక్కడ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోగ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దేవిశెట్టి హన్మాండ్లు, కార్యదర్శులు సూర్యనారాయణ, అవినాష్, వినయ్, రఘునందన్ రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. సప్తగిరికాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో ఉగాది సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. హాజరైన భక్తులకు ఉగాది పచ్చడి, తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు భక్తులు పాల్గొన్నారు. స్థానిక భాగ్యనగర్ సాయిబాబా ఆలయంలో ఉగాది సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రీనగర్‌లోని శ్రీ గణేశశారదా శంకరాలయంలో పంచాంగ శ్రవణం చేశారు. భగత్‌నగర్‌లోని అంజనాద్రి గుట్టపై జరిగిన వేడుకల్లో పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో చిలకపాటి హనుమంతరావు, అర్చకుడు రామకృష్ణశర్మ, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం గంజ్‌లోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళంపల్లి వేణుగోపాల్‌శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో వ్యాపారులు పాల్గొన్నారు.
చొప్పదండి, మార్చి 22: మండల ప్రజలు బుధవారం ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ఆలయాల్లో అర్చకులు పంచాంగం చెప్పారు. పట్టణంలోని యువశక్తి భవన్లో యువమోర్చా నాయకుల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
రామడుగు, మార్చి 22: మండల ప్రజలు ఉగాదిని పురస్కరించుకొని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. వెలిచాలలోని శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు సౌమిత్ర రామానుజా చార్యులు పంచాంగ శ్రవణం చేశారు. గోపాల్‌రావుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు డింగిరి సత్యనారాయణా చార్యులు పంచాంగ శ్రవణం చేయగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు వీర్ల ప్రభాకర్‌రావు, నార్ల రమేశ్, భక్తులు పాల్గొన్నారు.
గంగాధర, మార్చి 22: మండల ప్రజలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో అర్చకులు పంచాంగ శ్రవణం, రాశి ఫలాలు, ఆదాయ వ్యయాల గురించి ప్రజలకు వివరించారు. పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.