కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 7: ప్రభుత్వ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులో తెలంగాణ ప్రాంత గుత్తేదారులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ నేత సత్యమూర్తి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ. 20 వేల కోట్ల పైచిలుకు, జిల్లాలో వందలాది కోట్లు గుత్తేదారులకు చెల్లించాల్సి ఉండగా, మూడేళ్లుగా పెండింగ్‌లో పెడుతున్నారని విమర్శించారు.
బిల్లుల సీనియారిటీ ఆధారంగా నిధులు విడుదల చేయాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా ప్రక్రియ కొనసాగుతున్నదని మండిపడ్డారు. బ్యాక్‌డోర్ పేమేంట్స్కే ప్రాధాన్యమిస్తుండడంతో అప్పులు తెచ్చి పనులు చేసిన తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గతంలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, తెలంగాణ గుత్తేదారులకు న్యాయం చేస్తామంటూ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదన్నారు. మూడేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో తమ ఆస్థులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు.
దీంతో అనేక మంది గుత్తేదారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు గురవుతూ, గుండెపోటుతో మరణించిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు తాము బిల్లులెందుకు చెల్లించాలనే ధోరణిని ప్రదర్శిస్తున్నారని వాపోయారు. తెలంగాణలో ఆంధ్రా గుత్తేదారులకు కేటాయించిన పనులు రద్దు చేయాలని, లేనిపక్షంలో తామే అడ్డుకుంటామని హెచ్చరించారు.
తమ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించేందుకు ఈనెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టినట్లు వెల్లడించారు. అయినా, స్పందించకపోతే పనులు పూర్తిగా నిలిపేసి ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతామని స్పష్టం చేశారు. అనంతరం సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు వేముల సత్యమూర్తి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుగుణాకర్‌రావు, కట్కూరు దేవేందర్‌రెడ్డి, సురేందర్, కరీంనగర్ సెంటర్ చైర్మన్ దేవేందర్‌రావు, సంఘం ప్రతినిధులు పులి దేవేందర్‌రెడ్డి, హన్మంతరావు, దర్శనాల శంకరయ్య పాల్గొన్నారు.